Adilabad Viral Fevers: విషజ్వరాలతో పల్లె ప్రజలు విల విల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్-village people are plagued with poisonous fevers and viral fevers all over the adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Viral Fevers: విషజ్వరాలతో పల్లె ప్రజలు విల విల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్

Adilabad Viral Fevers: విషజ్వరాలతో పల్లె ప్రజలు విల విల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్

HT Telugu Desk HT Telugu
Sep 09, 2024 11:40 AM IST

Adilabad Viral Fevers: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్ జనాన్ని వణికిస్తున్నాయి. అసలు ఇవి ఏ తరహా జ్వరాలో అంతుబట్టక సీనియర్ డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు.జ్వరం వచ్చిన వారికి చికెన్ గున్యా, డెంగ్యూ లక్షణాలు కూడా ఉంటున్నాయి.పరీక్షల్లో నెగెటివ్ వస్తుండ డంతో అయోమయానికి గురవతున్నారు.

వైరల్ ఫీవర్లతో కిటకిటలాడుతున్న ఔట్ పేషంట్ విభాగం
వైరల్ ఫీవర్లతో కిటకిటలాడుతున్న ఔట్ పేషంట్ విభాగం

Adilabad Viral Fevers: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా వైరల్ ఫీవర్స్ జనాన్ని వణికిస్తున్నాయి. అసలు ఇవి ఏ తరహా జ్వరాలో అంతుబట్టక సీనియర్ డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన వారికి చికెన్ గున్యా తో పాటు డెంగ్యూ లక్షణాలు కూడా ఉంటున్నాయి.అయితే బ్లడ్ టెస్టుల్లో నెగెటివ్ వస్తుండ డంతో జ్వరాలొచ్చినవారు అయోమయానికి గురవు తున్నారు.

దీంతో ఆసుపత్రుల్లో వైరల్ ఫివర్ కు వాడే మందులే ఇస్తున్నారు. ఈ మందులకు జ్వరాలు తగ్గకపోవడం, తగ్గినా కీళ్ల నొప్పుల వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. జ్వరం వచ్చిన వారిలో కీళ్లు, ఒళ్ళు నొప్పుల లాంటి చికెన్ గున్యాలక్షణాలు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, దురద, దద్దుర్లు, వాపులు లాంటివి డెంగ్యూ లక్షణాలు ఒకేసారి కనిపిస్తున్నాయి.

బీపీ డౌన్ కావడం, కళ్ళు తిప్పడం వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి. ఈ జ్వరం సోకినవారు కీళ్లు, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో చాలామంది సొంతంగా నడవలే కపోవడంతో కుటుంబ సభ్యులు ఎత్తుకొని తీసుకొస్తు న్నారు.

రోగులను పరిశీలిస్తే డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు కనిపిస్తుండగా.. రక్త పరీక్షల్లో మాత్రం వైరల్ ఫీవర్ లక్షణాలు మాత్రమే వెల్లడవుతున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల మందికి రక్త పరీక్షలు చేస్తే కేవలం వందల మందికి మాత్రమే డెంగ్యూ నిర్థారణ అయ్యింది.

జ్వరం తగ్గినా నొప్పులు తగ్గడంలేదు

వైరల్ ఫీవర్స్‌తో ప్రభుత్వ, ప్రైవేటు, ఆసుపత్రు ల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు వారం రోజులైనా పూర్తిగా కోలుకోవడం లేదు. కోలుకు న్న తర్వాత కూడా 20 రోజుల నుంచి నెల వరకు కీళ్లు, ఒళ్ళు నొప్పులు, నీరసం, బీపీ, కళ్ళు తిప్పడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

నొప్పులు తగ్గడానికి డాక్టర్లు పెయిన్ కిల్లర్స్‌తో పాటు తక్కువ లక్షణాలున్న వారికి అందుబాటులో ఉన్న వైద్యం చేస్తున్నారు. నెగెటివ్ రిపోర్టులతో తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్న వారిలో చికెన్ గున్యా, డెంగ్యూ లక్ష ణాలు భౌతికంగా కనిపిస్తున్నా.. ఎలీసా టెస్ట్ లో నెగెటివ్వస్తోంది.

ప్రస్తుతం తీవ్రమైన జ్వరాలకు కారణం చికెన్ గున్యా వైరస్ లాంటి మరో వైరస్ కారణం కావచ్చు. తీవ్ర జ్వరంతో బాధపడే వారికి తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సివస్తోంది. జ్వరాలు తగ్గినా నొప్పులు మరో 20 రోజుల వరకు ఉంటున్నాయి. ఈ జ్వరాలొచ్చిన వారు యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడకుండా పారాసిటమాల్ వాడాలి. ఫ్రూట్ జ్యూస్, ఓ ఆర్ ఎస్ తో పాటు లిక్విడఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తీవ్ర జ్వరంతో ఉన్నవారికి తగిన మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వాల్సివస్తోందని అంటు న్నారు. ఉమ్మడి జిల్లా లోని ఆయా మండలంలో, ముఖ్యం గా ఏజెన్సీ ఉట్నూర్ లో వారం రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరం, కీళ్లు, ఒళ్ళు నొప్పులతో బాధపడు తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల మెడికల్ క్యాంపులు పెట్టారు. మూడు రోజులుగా డాక్టర్లు చికిత్స చేస్తుంటే ఇప్పుడిప్పుడే కొంతమంది కోలుకుంటున్నారు.

ప్రవేటు ఆసుపత్రుల లెక్క లేవి...

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జ్వరాల బాధితులు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో డెంగ్యూ, విష జ్వరాల కేసుల వివరాలు నమోదు చేస్తుండగా, ప్రైవేట్ హాస్పిటళ్లలో మాత్రం వీటి లెక్కలు చూపడం లేదు. జిల్లాలో రిమ్స్ మినహా డెంగ్యూ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఎక్కడా లేవు. ప్రభుత్వ హాస్పిటల్స్కు వచ్చే రోగుల శాంపుల్స్న రిమ్స్ లో నిర్ధారణ చేసి రిపోర్టు లు ఇస్తున్నారు.

ఇవి అధికారికంగా వైద్యారోగ్యశాఖ రికార్డుల్లో నమోదవుతున్నాయి. కానీ ప్రైవేట్లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలు మాత్రం చెప్పడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన మొత్తం డెంగ్యూ కేసులు ప్రభుత్వ దవాఖానాల్లోనివే. ప్రైవేట్ లో నిర్ధారణ అవుతున్న కేసులను మాత్రం బయటపెట్టకపోవడంతో వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పేదల రోగాలు.. ఆసుపత్రులకు పంట..

ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వందకు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో చాలా మంది జ్వరాలతో హాస్పిటల్స్‌కు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా భావించి టెస్టుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. జ్వరం ఉంటే చాలు రెండు, మూడు రోజులు అడ్మిట్ చేసుకొని మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ టెస్టులు చేసేస్తు న్నారు. ప్లేట్లెట్స్ పడిపోయాయని, డెంగ్యూ ఉందంటూ భయపెట్టేస్తున్నారు. అడ్మిట్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యే వరకు భారీగా బిల్లులు వేస్తున్నరని రోగులు ఆరోపిస్తున్నారు.

ఎలిసా టెస్టు ద్వారానే నిర్ధారించాలి….కృష్ణారావు, డీఎంహెచ్ ఓ, ఆదిలాబాద్.

ఎలిసా టెస్టు ద్వారా డెంగ్యూను నిర్ధారించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ డెంగ్యూ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలో అన్ని హాస్పిటల్స్ తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అనవసరంగా రోగులకు వైద్య పరీక్షలు చేస్తూ అధిక బిల్లులు వేయడం మానుకోవాలి. డెంగ్యూ కేసుల వివరాలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పటికప్పుడుపంపించాలని డిఎంహెచ్‌ఓ సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)