Warangal : మేడారానికి వెళ్లేందుకు వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం - నీళ్ల సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి-two children died after falling into the water in warangal city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : మేడారానికి వెళ్లేందుకు వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం - నీళ్ల సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Warangal : మేడారానికి వెళ్లేందుకు వచ్చిన కుటుంబంలో తీవ్ర విషాదం - నీళ్ల సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

HT Telugu Desk HT Telugu
Feb 18, 2024 10:01 AM IST

Warangal City News: వరంగల్ నగరంలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు.. నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శౌరితేజ(4), తేజస్వినీ(2)
శౌరితేజ(4), తేజస్వినీ(2)

Warangal City Crime News: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను చూసేందుకు వరంగల్ నగరానికి వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అమ్మమ్మ వాళ్లింటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

వరంగల్ నగరంలోని బాలాజీ నగర్ కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ కూతురు బలేశ్వరిని కొంతకాలం కిందట వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రవికుమార్ కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు శౌరితేజ(4), తేజస్వినీ(2) పుట్టారు. ఇంతవరకు బాగానే ఉండగా.. ఈ నెల 21వ తేదీ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. జాతర లో రష్ ని దృష్టిలో పెట్టుకుని రమశ్రీనివాస్ దంపతులు ముందస్తు మొక్కులు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. శనివారం మధ్యాహ్నం మేడారం వెళ్లేందుకు నిర్ణయించిన రమశ్రీనివాస్ దంపతులు కూతురు, అల్లుడిని కూడా ఆహ్వానించారు. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న బలేశ్వరి రవికుమార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలు శౌరితేజ, తేజస్వినీని తీసుకుని శుక్రవారం సాయంత్రం సాయంత్రం 8 గంటల సుమారులో బలేశ్వరి దంపతులు వరంగల్ నగరానికి వచ్చారు.

నీటి సంపులో తేలిన పిల్లలు

బలేశ్వరి, రవి కుమార్ దంపతులు హైదరాబాద్ నుంచి వరంగల్ కు రాగా.. ప్రయాణంలో అలసిపోవడంతో ఇద్దరు తొందరగా నిద్రపోయారు. మిగతా కుటుంబ సభ్యులంతా ఎవరి పనుల్లో వాళ్లుండిపోయారు. కాగా అమ్మమ్మ వాళ్లింటికి వచ్చిన పిల్లలు శౌరితేజ, తేజస్వినీ సంతోషంగా ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అది ఎవరూ గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో పిల్లలు కనిపించడం లేదని గుర్తించిన కుటుంబ సభ్యులు వారి కోసం చుట్టుపక్కల వెతికారు. ఇంతలోనే తల్లి బలేశ్వరి, తండ్రి రవికుమార్ నిద్రలేపడంతో వారు కంగారు పడిపోయి పిల్లల కోసం వెతకసాగారు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలోని నీళ్ల సంపు వైపు వెళ్లగా.. చిన్నారి తేజస్వినీ మృతదేహం నీళ్లలో తేలుతూ కనిపించింది. శౌరితేజ నీటిలో మునిగి కనిపించడంతో వెంటనే కుటుంబ సభ్యులు బయటకు తీశారు. అప్పటికే బాలుడు కూడా ప్రాణాలు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

శోక సంద్రంలో మునిగిన కుటుంబం

బలేశ్వరి, రవి కుమార్ దంపతులకు ఇద్దరు చిన్నారులే సంతానం కాగా.. ఆ ఇద్దరూ నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. చిన్నారుల మృతిచెందిన అనంతరం డెడ్ బాడీలను వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించగా.. అక్కడ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. నవ మాసాలు మోసి కనిపెంచిన పిల్లలు ఇద్దరూ కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లి బలేశ్వరి రోదించిన తీరు అక్కడున్న వాళ్లందరినీ కంట తడి పెట్టించింది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం వస్తే ఆ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో వరంగల్ బాలాజీ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

( రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner