TS POLYCET 2024 Exam : తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2024 పరీక్షకు సర్వం సిద్ధమైంది. మే 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 259 ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేశారు. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈసారి నిర్వహించబోయే పాలిసెట్ పరీక్ష కోసం 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈ పరీక్ష ద్వారా…. పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇవే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
తెలంగాణ పాలిసెట్ పరీక్ష మే 24వ తేదీన నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
జూన్ మొదటి వారంలో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా రానుంది. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. పాలిసెట్ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి. polycet-te@telangana.govi.inకు మెయిల్ కూడా చేయవచ్చని అధికారులు తెలిపారు.