Kaloji Award 2023 : కవి జయరాజ్ కు కాళోజీ అవార్డు, ఈ నెల 9న ప్రదానం-ts govt declared kaloji narayana rao award 2023 for poet jayaraj ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaloji Award 2023 : కవి జయరాజ్ కు కాళోజీ అవార్డు, ఈ నెల 9న ప్రదానం

Kaloji Award 2023 : కవి జయరాజ్ కు కాళోజీ అవార్డు, ఈ నెల 9న ప్రదానం

Bandaru Satyaprasad HT Telugu
Sep 06, 2023 08:14 PM IST

Kaloji Award 2023 : కవి జయరాజ్ కు కాళోజీ నారాయణ రావు అవార్డును ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ నెల 9న కాళోజీ జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు ప్రదానం చేయనున్నారు.

కవి జయరాజ్
కవి జయరాజ్

Kaloji Award 2023 : పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘కాళోజీ నారాయణరావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు ప్రకటించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కవి, గాయకుడు జయరాజ్ చేసిన కృషిని గుర్తిస్తూ కాళోజీ అవార్డును ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ కవి జయరాజ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 9న కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో కవి జయరాజ్ కు కాళోజీ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా రూ. 1,01,116 నగదు రివార్డు, జ్ఞాపికను అందించి సత్కరించనున్నారు.

వివక్ష లేని సమాజం కోసం

మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమసమాజం కోసం ఎన్నో సాహిత్య రచనలు చేశారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై అంబేడ్కర్ రచనలతో స్ఫూర్తి పొందిన జయరాజ్, తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లెల్లో తిరుగుతూ.. తన ఆట, పాట, గానంతో ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం జయరాజ్ పాటలు రచించారు. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. కవి జయరాజ్ రచించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.

2015 నుంచి అవార్డుల ప్రదానం

ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరిట "కాళోజీ అవార్డు"ను తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తుంది. ఈ పురష్కారాన్ని కాళోజీ నారాయణ రావు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 9న ప్రతి ఏటా తెలంగాణ భాషకు‌, సంస్కృతికి సేవలు చేసినవారికి అందజేస్తున్నారు. కాళోజీ నారాయణ రావు తెలంగాణ భాషకు, సంస్కృతికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజును “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాళోజీ పురష్కారం కింద అవార్డు, మెమెంటో, రూ.1,01,116 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు.

  • 2015 – అమ్మంగి వేణుగోపాల్
  • 2016 – గోరటి వెంకన్న
  • 2017 – రావులపాటి సీతారాం
  • 2018 – అంపశయ్య నవీన్
  • 2019 – కోట్ల వెంకటేశ్వర రెడ్డి
  • 2020 – రమా చంద్రమౌళి
  • 2021- పెన్నా శివరామకృష్ణ
  • 2022 – రామోజు హరగోపాల్
  • 2023- జయరాజ్

Whats_app_banner