Budget 2022| కేంద్రంపై కేసీఆర్ మాటల్లో తప్పేముంది.. బీజేపీకి రాజ్యాంగంపై గౌరవమే లేదు: టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపణలు గుప్పించారు కేసీఆర్. అయితే దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు స్పందించారు. బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పులేదని చెప్పుకొచ్చారు.
కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ కు మాట్లాడే హక్కు ఉందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అన్నారు. తెలంగాణకి ఏం చేయాలనుకుంటున్నారో 2014లో చెప్పిన కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. కేంద్రం ఇప్పుడు చెప్తున్నవి కేసీఆర్ ముందే తెలంగాణలో చేసి చూపించారని పేర్కొన్నారు.
అసలు ఏం సాధించారు?
'బీజేపీ 5 ట్రిలియన్ ఎకానమీ తీసుకువస్తుందని.. కేంద్రం 5 ఏళ్ళ క్రితం చెప్పింది.. ఇప్పుడు కూడా దేశం అక్కడే ఉంది. 375 లక్షల కోట్ల బడ్జెట్ పెడితేనే 5 ట్రిలియన్ ఎకానమీ సాధించినట్టు. తెలంగాణ బడ్జెట్ రెట్టింపు అయింది... అదీ టార్గెట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అంటే అది తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 ఏళ్లకు తెలంగాణ జీడీపీ రెట్టింపు అయ్యింది. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగం గురించి రెండు నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా?. 2016లో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అని చెప్పి.. ఎందుకు సాధించలేకపోయారో చెప్పనేలేదు. ధాన్యం కొనుగోళ్ల గురించి ముందే చెప్పండి అని కోరుతున్నా కేంద్రం చెప్పడం లేదు. పీఎం కిసాన్ నిధుల కంటే కేసీఆర్ రైతు బంధు నిధులే ఎక్కువ. ధాన్యాల సేకరణ పాలసీ రూపొందించాలి. ఎంఎస్ పీకి నిధులు పెట్టాం అంటే సరిపోదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇచ్చుకున్నారు. కానీ, తెలంగాణకు ఏ రంగంలో సరైన కేటాయింపులు లేవు. తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 గా ఉంది. దేశంలో ముందున్న తెలంగాణ కు కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.' అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు
కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉంది. బీజేపీనే దళిత వ్యతిరేక పార్టీ. దేశంలో 40 కోట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ లో నిధులు లేవు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు గురించి.. కేసీఆర్ పై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణం వెనక అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించలేని స్థితిలో బీజేపీ ఉంది. దళితులు, బీసీలు, మైనారిటీలు, రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదు. దళితుల సంక్షేమం బీజేపీకి పట్టదు. దేశంలో కరోనా పరిస్థితుల వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బీజేపీ దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు .రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది. వ్యవసాయం, డాం సేఫ్టీ, ఎన్ఐఏ ను తన గుప్పెట్లోకి తీసుకుంది. రాజ్యాంగాన్ని బీజేపీ రాజ్యాంగంగా మార్చుకుంది.
- వెంకటేష్ నేత, టీఆర్ఎస్ ఎంపీ