మండలి ఛైర్మన్​గా గుత్తా.. డిప్యూటీ ఛైర్మన్​ రేసులో కొత్త ఎమ్మెల్సీ ..!-trs mlc gutta sukhendarreddy nominated as chairman of telangana legislative council ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మండలి ఛైర్మన్​గా గుత్తా.. డిప్యూటీ ఛైర్మన్​ రేసులో కొత్త ఎమ్మెల్సీ ..!

మండలి ఛైర్మన్​గా గుత్తా.. డిప్యూటీ ఛైర్మన్​ రేసులో కొత్త ఎమ్మెల్సీ ..!

HT Telugu Desk HT Telugu
Mar 13, 2022 10:02 AM IST

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్​గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి ఎన్నిక కావటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోసారి ఆయనకే అవకాశం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయగా.. ఇవాళ మంత్రులతో కలిసి గుత్తా నామినేషన్ దాఖలు చేశారు.

మండలి ఛైర్మన్ గా గుత్తా
మండలి ఛైర్మన్ గా గుత్తా (Telangana Legislative Council website)

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్​ ఎన్నికపై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా మండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ గుత్తా పేరు ఖరారు చేశారు. రెండోసారి కూడా  ఆయనకే  అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.  ఇందులో భాగంగా గుత్తా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.  ఆయన తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్‌ సెట్లు దాఖలు చేయగా.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు  కూడా సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

సీఎంకు కృతజ్ఞతలు - ఎమ్మెల్సీ గుత్తా

మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ,  జగదీష్‌రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ వేసిన తరువాత గుత్తా మీడియాతో మాట్లాడారు. రెండోసారి శాసన మండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మాదిరిగానే సభను హుందాగా నడిపించేందుక కృషి చేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సంబంధించి సహకరించిన సభ్యులకు ధన్వవాదాలు తెలిపారు.

డిప్యూటీ ఛైర్మన్​గా బండా ప్రకాశ్..!

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ముదిరాజ్ కొద్దిరోజుల కిందట ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే మండలి డిప్యూటీ ఛైర్మన్​గా ఆయన పేరు ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన తర్వాతే బండా ప్రకాశ్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఖాళీగా ఉన్న చీఫ్‌విప్‌తో పాటు, విప్‌ల పేర్లను కూడా ప్రకటించేలా కనిపిస్తోంది.

నోటిఫికేషన్ విడుదల

శాసనమండలి చైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శి శనివారం విడుదల చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ వివరాలను మండలి సభ్యులందరికీ పంపించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశంలో కొత్త చైర్మన్‌ ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే అధికార టీఆర్​ఎస్​కు 36 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఎంఐఎంకు ఉన్న ఇద్దరు సభ్యులు కూడా అధికార పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో వీరి బలం 38కి చేరుతుంది.ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేసే సభ్యుడు మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనప్రాయమే...! 

మండలి ఛైర్మన్​ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయిన తరువాత డిఫ్యూటీ ఛైర్మన్​ ఎన్నికను చేపట్టే అవకాశం ఉంది. ఈ నెల 14న కొత్త ఛైర్మన్​ ఎన్నికవుతారు. 15వ తేదీన డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్​ను  విడుదల చేస్తారని తెలుస్తోంది.

 

IPL_Entry_Point