Triplets In Bhadrachalam: వయసు 28.. పది మంది… ఒకే కాన్పులో ముగ్గురు
Triplets In Bhadrachalam: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు జన్మించారు. చత్తీస్‌ఘఢ్‌కు చెందిన మహిళకు ఏరియా ఆస్పత్రిలో సాధారణ కాన్పులోనే ముగ్గురు జన్మించారు. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Triplets In Bhadrachalam: భద్రాచలంలో ఓ ఆదివాసీ మహిళకు సాధారణ కాన్పులో ముగ్గురు జన్మించారు. ఆమె ఇప్పటికే ఏడుగురు సంతానం ఉండగా, ఇప్పుడు మరో ముగ్గురికి జన్మనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బుధవారం హెడ్నర్స్ విజయశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది సాధారణ కాన్పు చేశారు. ఆ మహిళకు ఇది 8వ కాన్పుగా తెలిపారు.
బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ బట్టిగూడెం గ్రామానికి చెందిన పుజ్జ, ఈనెల 2న కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో చేరింది. బుధవారం నొప్పులు రావడంతో మిడ్వైఫ్ విభాగంలో సాధారణ ప్రసవం చేశారు. ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు పుట్టారు. ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆస్పత్రి పిల్లల డాక్టర్రాజశేఖర్, సూపరింటెండెంట్ డా.రామకృష్ణ తెలియజేశారు.
పుజ్జికి గతంలో ఏడు కాన్పులు జరిగాయి. వాటిలో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. అవి కూడా సాధారణ ప్రసవాలేనని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్న పుజ్జకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్స నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
బుధవారం పుజ్జ మొదట ఇద్దరు మగ శిశువులకు జన్మనివ్వడంతో, వైద్యులు కవల పిల్లలని భావించారు. ఇంతలో పుజ్జ మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పుజ్జ వయసు 28 ఏళ్లు మాత్రమే కావడం,వరుసగా ఎనిమిదో కాన్పు కావడంతో మరోసారి గర్భం ధరించడం మంచిది కాదని వైద్యులు వివరించారు.
ఇప్పటికే ఉన్న నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలతో కలిపి తాాజాగా పుట్టిన ముగ్గురితో కలిపి ఆమెకు మొత్తం పది మంది సంతానం అయ్యారు. పుజ్జకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. పుజ్జకు సాధారణ ప్రసవం జరిగేలా కృషి చేసిన హెడ్‌నర్సు విజయశ్రీ, ఇతర సిబ్బందిని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు.