Mahabubabad District : మంత్రాల నెపంతో దారుణ హత్య - వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు-the old man was beaten to death by the young man over black magic in mahabubabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahabubabad District : మంత్రాల నెపంతో దారుణ హత్య - వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

Mahabubabad District : మంత్రాల నెపంతో దారుణ హత్య - వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

HT Telugu Desk HT Telugu
Sep 27, 2024 04:21 PM IST

మంత్రాల నెపంతో దారుణ హత్య జరిగింది. ఓ వృద్ధుడిని యువకుడు కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు… పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు
వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

మహబూబాబాద్ జిల్లాలో మంత్రాల నెపంతో జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా.. తాజాగా శుక్రవారం ఉదయం ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో మరో ఘోరం జరిగింది. 

చిన్న ముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడిని అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు దారుణంగా హతమార్చాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

గ్రామానికి మల్లం యాకయ్య అనే వృద్ధుడు మంత్రాలు చేస్తున్నాడంటూ గ్రామంలో ప్రచారం జరిగింది. కాగా యాకయ్య బంధువు, అదే గ్రామానికి చెందిన మల్లం రాజు కుటుంబంలో మంచి కాకపోవడంతో యాకయ్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో యాకయ్యపై పగ పెంచుకున్నాడు. 

ఇదిలాఉంటే శుక్రవారం ఉదయం యాకయ్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు మీదుగా వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చి రాజు కర్రతో యాకయ్య తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు గాయం కావడంతో యాకయ్య అక్కడే కుప్పకూలాడు. తీవ్ర రక్త స్రావం జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా మంత్రాల నెపంతో హత్యకు పాల్పడటంతో గ్రామస్థులు రాజుకు దేహశుద్ధి చేశారు. తాళ్లతో అతడిని కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తొర్రూరు సీఐ జగదీష్​, నెల్లికుదురు ఎస్సై రమేష్​ బాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

కొద్దిరోజుల కిందట తల్లీకొడుకుల మర్డర్

మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో దాదాపు ఐదు నెలల కిందట మహబూబాబాద్ జిల్లాలో తల్లీకొడుకులను పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 10న మహబూబాబాద్ జిల్లా గూడూరు బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరగగా.. స్థానికంగా తీవ్ర భయాందోళనను రేపింది. 

గూడూరు మండలంలోని బొల్లెపెల్లికి చెందిన శివరాత్రి కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడం, పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదనే ఉద్దేశంతో తన కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఆలకుంట కొమురయ్య, సమ్మక్క(55), కుటుంబసభ్యులు మంత్రాలు చేశారని అనుమానం పెంచుకున్నాడు. 

ఈ విషయంలో కొంతకాలంగా వారి కుటుంబంతో గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో కొమురయ్య కుటుంబ సభ్యులు గ్రామ పెద్ద మనుషులను ఆశ్రయించగా.. పలుమార్లు ఇరువురి మధ్య పంచాయితీ కూడా నిర్వహించారు. ఇద్దరికీ పెద్ద మనుషులు సర్ది చెప్పి పంపించారు. ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగగా.. గూడూరు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 8న కొమురయ్య కొడుకు సమ్మయ్య(40) కూతురు ఎంగేజ్మెంట్ ఉండటంతో పోలీసులు కేసును సోమవారం తర్వాత చూస్తామని చెప్పి పంపించారు. దీంతో ఫిబ్రవరి 10న ఉదయం 11 గంటల సుమారులో కొమురయ్య, సమ్మక్క, వారి కొడుకు సమ్మయ్య, శివరాత్రి కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వస్తూ బస్టాండ్ సమీపంలో గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆటో డ్రైవర్ కుమార్ కోపంతో రగిలిపోయాడు. 

అదే కోపంలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ఆటోలోని ఐరన్ రాడ్ తో సమ్మక్క తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న ఆమె కొడుకు సమ్మయ్య, భర్త కొమురయ్య అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిపైనా రాడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి సమ్మక్క, కొడుకు సమ్మయ్య ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. కొమురయ్య కాలు, చేయి విరిగి ఆసుపత్రి పాలయ్యాడు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner