TSPSC: ఉద్యోగ అభ్యర్థులకు ఓటీఆర్ తప్పనిసరి.. నమోదు కోసం ఇలా చేయండి
త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అయితే ఉద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఉద్యోగ అభ్యర్థులు OTR (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని వెల్లడించింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఓటీఆర్ లో మార్పులు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. విద్యార్హతలు స్పష్టంగా నమోదు చేయాలని...నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిమిషాల్లో ఓటీఆర్ ఐడీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని వివరించారు. గతంలో ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులు.. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఎడిట్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఇలా ..
https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ‘ One Time Registration(NEW)పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు పేర్కొనాలి. ఈ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, మెయిల్ ఐడీ, 1 - 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు పేర్కొనాలి.
అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ తప్పనిసరి. ఈ వివరాలన్నీ పూర్తి చేస్తే టీఎస్‌పీఎస్సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఓటీఆర్ ఎడిట్...
ఓటీఆర్ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది టీఎస్పీఎస్సీ. ఇందుకోసం వెబ్ సైట్ లో Edit One Time Registration పేరుతో ప్రత్యేక కాలమ్ ఉంటుంది. సరైన క్రమంలో వివరాలు ఇస్తే ఓటీఆర్ లో మార్పులు చేర్పులు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
* టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో Edit One Time Registrationపై క్లిక్ చేయాలి. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
* ఎడిట్ చేయాల్సిన వివరాలు సవరించడంతో పాటు 1 - 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదు చేసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత కొత్త ఓటీఆర్ పీడీఎఫ్ కాపీ జనరేట్ అవుతుంది.
అసెంబ్లీ వేదికగా 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా శాఖలు భర్తీ ప్రక్రియపై దృష్టిసారించాయి. అయితే గ్రూపు సర్వీసులోని ఉద్యోగాలన్నీ టీఎస్పీఎస్పీ భర్తీ చేయనుంది. మిగతా ఉద్యోగాలు ఆయా శాఖలు చేపట్టనున్నాయి. ఇప్పటికే పోలీసు శాఖ త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇక విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇది పూర్తి అయిన తరువాత డీఎస్పీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.