తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో జూన్ 27 న నాలుగో తరగతి ప్రవేశానికి ఎంపికలు
తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరం నాలుగో తరగతి ప్రవేశానికి ఎంపికలు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్ రావు తెలిపారు.
మెదక్ : తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరం నాలుగో తరగతి ప్రవేశానికి ఎంపికలు నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకింపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో నాల్గవ తరగతి ప్రవేశాల కోసం జూన్ 27 న బాలబాలికలకు సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
జిల్లా స్థాయిలో సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో 27 జూన్ 2024న ఉదయం 9 గంటలకు బాలబాలికలు సెలక్షన్స్‌కు హాజరు కాగలరని సూచించారు. ఈ నాలుగో తరగతి అడ్మిషన్స్ కోసం 01-09-2015 నుండి 31-08-2016 మధ్య పుట్టిన వారు అర్హులని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన 20 మంది బాలురు, 20 మంది బాలికలకు హకీం పేట్ లోని క్రీడా పాఠశాలలో రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. జూలై 10, 11 వ తేదీలలో హకీంపేట్ లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు జరుగుతాయని తెలిపారు.
ధ్రువ పత్రాలు, ఎంపిక పోటీలు
చదువుతున్న పాఠశాల నుండి మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు, జన్మధ్రువీకరణ పత్రం తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్, 5 పాస్ ఫోటోలు, కమ్యునిటి సర్టిఫికెట్స్ తీసుకొనిరావాలి.
వైద్య పరీక్షలలో నెగ్గిన విద్యార్థులకు 9 శారీరక సమర్థ అంశాలలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. అవి ఎత్తు,బరువు, 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్,800 మీ, పరుగు, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ టెస్ట్, 6×10 మీటర్ల షటిల్ రన్ నిర్వహిస్తారు.
బాల బాలికలకు వేరువేరుగా ఎంపిక పోటీలు నిర్వహించి పాయింట్స్ కూడా వేరువేరుగా ఇస్తారు. ఒక్కో పరీక్షకు అత్యధికంగా 3 పాయింట్స్ లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ సాధించిన విద్యార్థులు ఆయా క్రీడ పాఠశాలలో సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలో మెరిట్ పాయింట్స్ సాధించిన 20 మంది బాలురు మరియు 20 మంది బాలికలను ఒక క్రీడా పాఠశాలకు ఎంపిక చేస్తారు.
వివరాల కోసం జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం సంగారెడ్డి ఫోన్ నెంబర్ 08455-274344,9000491112 లో సంప్రదించవచ్చు.
సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్
తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్, 2025 (ప్రిలిమ్స్, మెయిన్స్) పరీక్ష కు ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణను అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు బీసీ స్టడీసర్కిల్ వెబ్సైట్ https://tgbcstudycircle.cgg.gov.in/FirstPage.do ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దానికి ఈ నెల 19 నుండి జులై 03 లోగా దరఖాస్తు చేసుకోగలరని సూచించారు.
నియమ నిబంధనలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించరాదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుండి 100 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయడం కొరకు అర్హత పరీక్ష జులై 07వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిపారు.
వీరికి జులై 18 నుండి 2025 ఏప్రిల్ 18 వరకు శిక్షణ తరగతులు హైదరాబాద్ లోని సైదాబాద్ లక్ష్మీనగరాకాలనీలో నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల లాడ్జింగ్ మరియు రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ. 5 వేలు, బుక్ ఫండ్ నిమిత్తము రూ. 5 వేలు ఒకేసారి అందిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు 08455-277015, 99495 92991 నెంబర్లను లేదా బిసి స్టడీసర్కిల్, వెలుగు ఆఫీస్ క్యాంపస్, బైపాస్ రోడ్, సంగారెడ్డి నందు ఆఫీస్ వేళలలో నేరుగా సంప్రదించగలరు.