Telangana High Court : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
Telangana High Court : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై.. హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణలోని శాశ్వత నివాసితులైన వారికి.. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 85 శాతం స్థానిక కోటా కింద.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని 53 మంది పిటిషనర్లు కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసినా.. ఇప్పటికీ తెలంగాణలో శాశ్వత నివాసులుగా ఉన్నామని కోర్టుకు వివరించారు. స్థానిక అభ్యర్థులకు సంబంధించి రూల్ 3 (ఎ) వారి హక్కులను ఉల్లంఘించిందని వాదించారు.
పిటిషనర్ల వాదనలను పరిశీలించిన హైకోర్టు.. కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ రాష్ట్రం వెలుపల విద్యా భ్యాసం పూర్తి చేసినప్పటికీ, తెలంగాణలో శాశ్వత నివాసితులైన విద్యార్థులను చేర్చేలా రూల్ 3(ఎ)ని సవరించాలని ఆదేశించింది. పిటిషనర్లు తెలంగాణలో తమ నివాసం, శాశ్వత నివాసాన్ని రుజువు చేసుకుంటే స్థానిక కోటా కింద ప్రవేశానికి అర్హులని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ముఖ్యాంశాలు..
2017 అడ్మిషన్ నిబంధనలలోని రూల్ 3(ఎ) చెల్లుబాటును సవాల్ చేస్తూ.. దాఖలైన 53 రిట్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
తెలంగాణలో శాశ్వత నివాసితులు 85 శాతం స్థానిక కోటా కింద ప్రవేశానికి అర్హులని కోర్టు స్పష్టం చేసింది.
"శాశ్వత నివాసి" స్థితిని నిర్వచించడానికి మార్గదర్శకాలను రూపొందించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. స్థానికతపై తీర్పునిచ్చింది.