Chiranjeevi Land Issue :చిరంజీవి ఇంటి స్థలంపై హైకోర్టు ఉత్తర్వులు….
Chiranjeevi Land Issue మెగాస్టార్ చిరంజీవికి చెందిన స్థలవివాదంపై యథాతథస్థితిని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసింది. వివాదంలో ఉన్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంది. సినీ నటుడు చిరంజీవికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ భూమి రిజిస్ట్రేషన్ చేయడంపై కేసు నమోదైంది.
Chiranjeevi Land Issue జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సినీ నటుడు చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలని చిరంజీవి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి సొసైటీ విక్రయించిందని జె. శ్రీకాంత్ బాబు, తదితరులు వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కామన్ అవసరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని, అందులో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
వాదనలు విన్న హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితిని అమలు చేయాలని ఆదేశించింది.
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో 595 గజాల స్థలాన్ని చిరంజీవిత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ప్రధాన అభియోగంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 25లో ఫ్లాట్ నెంబరు 303-ఎన్ లో 3333 గజాల స్థలంలో ఇల్లు ఉంది.
ఈ స్థలాన్ని అనుకొని ఉన్న వెనుక భాగంలో షేక్ పేట కొత్త సర్వే నంబరు 120లో హకీంపేట గ్రామంలోని సర్వే నెంబరు 102/1లో 595 గజాల స్థలం ఉంది. బహిరంగ మార్కెట్ లో దీని విలువ గజం రూ.4లక్షలకు పైనే ఉంటుంది. గత ఏడాది ఈ స్థలాన్ని గజం రూ.64 వేల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రూ.23.9 కోట్లు విలువ చేసే స్థలాన్ని కారుచౌకగా రూ.3.8కోట్లకే అప్పజెప్పారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు చిరంజీవి నివాసం వెనుక ఉన్న 595 గజాల స్థలానికి ఎలాంటి దారి లేదని, రికార్డుల్లో ఉన్న విలువకు వాస్తవ పరిస్థితికి పొంతన లేదని చెబుతున్నారు. మార్కెట్ రేటు ఎంత ఉన్నా, చిరంజీవికి మినహా ఇతరులకు ఆ స్థలం ఉపయోగ పడే వీలు లేకపోవడంతోనే తక్కువ ధరకు విక్రయించినట్లు మరో వర్గం చెబుతోంది. అయితే కామన్ అవసరాల కోసం కేటాయించిన స్థలానికి ఎలాంటి ప్రవేశమార్గాలు లేకపోవడం వెనుక సొసైటీ అక్రమాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. లే ఔట్ నిబంధనలు, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, రహదారుల్ని ఆక్రమించడం వంటి కారణాలతోనే దారి లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.