Kothagudem Politics : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కామెంట్స్.. ఆసక్తికరంగా కొత్తగూడెం పాలిటిక్స్
Kothagudem Politics : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదికాలంగా కొత్తగూడెంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోన్న ఆయన... ఎన్నికల్లో పోటీపై పరోక్ష సంకేతాలు పంపించారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే, కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే.. ఎలాంటి పదవి నుంచి అయినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
Kothagudem Politics : తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao) పేరు కొన్నాళ్లుగా పరిపాలన పరంగా కంటే .. పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, స్వచ్ఛంద కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉంటోన్న ఆయన.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అరంగ్రేటం చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి మరింత బలంగా చేకూర్చే విధంగా... శ్రీనివాస రావు కీలక కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న ఆయన..... "సీఎం కేసీఆర్ ఆదేశిస్తే, కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే.. ఎలాంటి పదవి నుంచి అయినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి అంశంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొత్తగూడెంపై ఫోకస్ చేసినట్లుగా చెప్పకనే చెప్పారు... హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు.
"కొత్తగూడెం ప్రాంతాన్ని సుమారు 5 దశాబ్దాల నుంచి చూస్తున్నాను. నియోజకవర్గ పరిధిలో అనేక సహజ వనరులు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి పథంలో నడుస్తోంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి పరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ గారు హెల్త్ డైరెక్టర్ గా నాకు అవకాశం ఇచ్చారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించే క్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు వారికి రుణ పడి ఉంటాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఆదేశిస్తే.. నా కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే.. ఎలాంటి పదవి నుంచైనా సరే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ శ్రీనివాస రావు చేసిన కామెంట్స్.. సంచలనంగా మారాయి.
కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యల అమలులో కీలక పాత్ర పోషించిన డీహెచ్ శ్రీనివాసరావు... గతేడాది కాలంగా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జీఎస్ఆర్ ట్రస్ట్ పేరిట జాబ్ మేళాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పండుగల సమయంలో వేడుకలు జరుపుతున్నారు. ఆపదలో ఉన్న వారికి వ్యక్తిగత సహాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇవన్నీ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరిగినా... ఇన్నాళ్లూ ఎన్నికల్లో పోటీపై స్పష్టమైన ప్రకటన చేయని ఆయన.... ఇవాళ మాత్రం పరోక్ష సంకేతాలు పంపారు. కేసీఆర్ ఆదేశిస్తే... పొలిటికల్ ఎంట్రీకి రెడీ అని తేల్చి చెప్పారు. తద్వారా... కొత్తగూడెం నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు.
కొత్తగూడెం సీటుపైనే అందరి దృష్టి..
కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ అవకాశాల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆయన.... ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మరోసారి ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవాలని చూస్తున్నారు. మరోవైపు ఇదే స్థానంపై ఫోకస్ చేశారు.. జలగం వెంకటరావు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ఇదే స్థానంపై దృష్టి సారించారు. 2009లో ఇక్కడ్నుంచే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ లెఫ్ట్ పార్టీలు, బీఆర్ఎస్ మధ్య పొడిచిన పొత్తు.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగితే... కొత్తగూడెం సీటు కోసం సీపీఐ గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు నిలుస్తారు ? లేక పొత్తుల్లో భాగంగా ఈ సీటు కమ్యూనిస్టులకి వెళుతుందా అన్న చర్చ సాగుతోన్న సమయంలో.... హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు... కొత్తగూడెం పాలిటిక్స్ ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. మరి శ్రీనివాస రావు కోరికను సీఎం కేసీఆర్ నెరవేరుస్తారా ? హేమాహేమీలను కాదని.. ఆయనకు కొత్తగూడెం టికెట్ ఇస్తారా ? శ్రీనివాసరావు ఆశిస్తున్న ఆ "పదవి" దక్కుతుందా లేదా .. ? ఈ ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం రానుంది.