Gruha Lakshmi Applications : పలు జిల్లాల్లో 'గృహలక్ష్మి' దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 10 డెడ్ లైన్!
TS Gruha Lakshmi Applications: గృహలక్ష్మి పథకం అమలులో భాగంగా పలు జిల్లాల్లో దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 10వ తేదీలోపు కలెక్టరేట్ కార్యాలయాల్లో అప్లికేషన్స్ ను సమర్పించాలని ఓ ప్రకటనలో కోరారు.
Telangana Gruha Lakshmi Scheme Updates: సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఇందుకోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా... పలు జిల్లాల్లో దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఆ మేరకు ములుగు, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల నుంచి ప్రకటనలు విడుదలయ్యాయి. ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఆగస్టు 10 డెడ్ లైన్…
ఆగస్టు 10 లోపు గృహలక్ష్మి కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహలక్ష్మి పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, ములుగు జిల్లాలో ఉన్న ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి 2590 ఇండ్లు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు 1200 ఇండ్లను, జిల్లాకు మొత్తం 3790 గృహలక్ష్మి ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గృహలక్ష్మి పథకం కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా తయారు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం లబ్ధి కోసం అవసరమైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 10 తారీఖు లోగా మండల కార్యాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గృహలక్ష్మి కౌంటర్లలో సమర్పించాలని కలెక్టర్ వెల్లడించారు.
ప్రత్యేక బృందాల తనిఖీలు....
ఆగస్టు 10వ తారీఖు వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా రూపొందించి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి విచారణ చేపడతామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇండ్లు లేని వారికి, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద లబ్ది పొందని వారిని అర్హులుగా ఎంపిక చేయడం జరుగుతుందని , ఆగస్టు 20వ తారీకు వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఆగస్టు 25 నాటికి జిల్లాకు కేటాయించిన గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. గృహలక్ష్మి ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సమీప ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, ప్రతి మండల తహసిల్దార్ కార్యాలయంలో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఆగస్టు 10లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మార్గదర్శకాలు ఇవే….
సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు.
రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందికి, మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందనుంది.
కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి.
జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండు గదులతో ఆర్‌సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది.
ఆహార భద్రత కార్డు, సొంత స్థలం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
4 లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారు.
ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రభుత్వం తెలిపింది. దివ్వాంగులకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది ప్రభుత్వం.