Ts Group 4 Applications : గ్రూప్ 4 అప్లికేషన్ల స్వీకరణ వాయిదా….
Ts Group 4 Applications తెలంగాణ గ్రూప్ 4 అప్లికేషన్ల స్వీకరణ వాయిదా పడింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ప్రకటించినా సాంకేతిక కారణాలతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం నిరుద్యోగుల్ని నిరుత్సాహానికి గురి చేసింది.
Ts Group 4 Applications తెలంగాణ గ్రూప్ 4 ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తొలుత ప్రకటించినా సాంకేతిక కారణాలతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పిసఎస్సీ ప్రకటించింది.
గ్రూప్ 4 ఉద్యోగాల దరఖాస్తుకు కొత్త తేదీలను టిఎస్‌పిఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు గ్రూప్ 4 దరఖాస్తుల్ని స్వీకరించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 ఉద్యోగాలను టిఎస్‌పిఎస్సీ భర్తీచేయనుంది. గ్రూప్4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది.
త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల ప్రకటన….
తెలంగాణలో త్వరలో గ్రూప్2, గ్రూప్ 3 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు టిఎస్‌పిఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2,3 పరిధిలో మరిన్ని ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల్ని చేర్చడంతో పెరిగిన పోస్టుల్ని గుర్తించి వాటిని ప్రస్తుత ప్రకటనల్లో చేర్చింది. గ్రూప్2 కింద మొదట 663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. అదనంగా చేరిన పోస్టులతో కలిపి ఉద్యోగాల సంఖ్య 783కు చేరింది. గ్రూప్ 3 కింద అనుమతించిన 1373 పోస్టులకు అదనంగా మరో వంద పోస్టులు నోటిఫికేషన్‌లో జత చేరనున్నాయి. రెండు నోటిఫికేషన్లను జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
గ్రూప్-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, జూనియర్ అకౌంటెంట్ 429, జూనియర్ ఆడిటర్ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ కానున్నాయి.
భారీ సంఖ్యలో దరఖాస్తుల అంచనా..
గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని భావిస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్‌ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.