Telangana Formation Day : తెలంగాణ పదేళ్ల ప్రస్థానం-సంక్షేమ పథకాల అమలులో ముందడుగు-telangana formation day 2023 cm kcr govt welfare scheme implementing followed many states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Formation Day : తెలంగాణ పదేళ్ల ప్రస్థానం-సంక్షేమ పథకాల అమలులో ముందడుగు

Telangana Formation Day : తెలంగాణ పదేళ్ల ప్రస్థానం-సంక్షేమ పథకాల అమలులో ముందడుగు

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 05:24 PM IST

Telangana Formation Day : తెలంగాణ పదేళ్ల పస్థానంలో సంక్షేమ పథకాలు కీలకం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదేళ్ల కాలంలో పలు కీలక పథకాలు అమలుచేశారు సీఎం కేసీఆర్.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

Telangana Formation Day : తెలంగాణలో రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్... సంక్షేమ పథకాల ఆచరణలో దేశం మొత్తాన్ని ఆకర్షించారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతు బంధు, దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి కీలక సంక్షేమ పథకాల అమలు చేస్తుంది. తెలంగాణ పదేళ్ల ప్రస్థానంలో పలు కీలక పథకాలు అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం.

రైతు బంధు

వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ శాలపల్లి-ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాస్ పుస్తకాలు అందుకున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5 వేలు చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10 వేలు పెట్టుబడిగా ఇస్తుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో అందిస్తారు. ఈ పథకం కింద రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు రూ. 58,102 కోట్ల సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

దళిత బంధు

తెలంగాణ దళితబంధు పథకం...దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. దళితుల సాధికారతే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడం కోసం ఈ పథకం ఉపయోగపడనుంది. 2021 ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులను విడుదల జేయడంతో ఈ పథకం ప్రారంభించారు సీఎం కేసీఆర్. 2021 సంవత్సరం బడ్జెట్‌లో 'సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్' పేరుతో వెయ్యి కోట్లు కేటాయించారు.

మిషన్ భగీరథ

తెలంగాణలోని ప్రతి ఇంటికీ మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో 43,791 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోని ఇళ్లకు తాగునీరు అందిస్తున్నారు. గోదావరి నది (53.68 టీఎంసీ), కృష్ణా నది (32.43 టీఎంసీ) నుంచి సేకరించిన నీటి ద్వారా రాష్ట్రంలోని అన్ని గృహాలకు తాగునీటిని సరఫరా చేస్తుంది ప్రభుత్వం. మిషన్ భగీరథ అమలు కోసం ప్రభుత్వం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ ని ఏర్పాటుచేసింది. 59 ఓవర్ హెడ్, గ్రౌండ్ లెవల్ ట్యాంకులు అందుబాటులో తెచ్చింది. అదేవిధంగా పైపింగ్ వ్యవస్థ 1.697 లక్షల కిలోమీటర్లు నడుస్తుంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్ట్ డబుల్ బెడ్ రూమ్ పథకం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది ఈ పథక లక్ష్యం. ఈ పథకం ద్వారా 2019, మార్చి 2.72 లక్షల ఇళ్లు, 2024 నాటికి అదనంగా మరో 3 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. 2014, మే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మానిఫెస్టోలో ఈ పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకోసం 5.72 లక్షల ఇళ్లు కేటాయించారు. 2016, మార్చి 5న ఎర్రవల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును నిర్మించారు. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప‌థ‌కంలో భాగంగా 9,328.32 కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,91,057 ఇళ్లు మంజూరు చేశారు.

ఆసరా పింఛను పథకం

తెలంగాణ ఆసరా పింఛను పథకం ద్వారా వృద్ధుల, వికలాంగులకు పింఛన్ అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధిపొందుతున్నారు. దేశంలోనే బీడి కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ అన్నారు. పింఛన్లను పెంచుతామని కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ. 1000, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500 లకు పెంచుతున్నట్టు తెలిపారు. 2019లో వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ. 2,016, వికలాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచారు.

కాళేశ్వరం

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలోని భూపాల్ పల్లి కాళేశ్వరంలోని గోదావరి నదిపై నిర్మించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను 13 జిల్లాల ద్వారా సుమారు 500 కి.మీ దూరం వరకు 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించారు. 1,800 కిమీ కన్నా ఎక్కువ కాలువ నెట్‌వర్క్‌ ఈ ప్రాజెక్టులో ఉంది. మొత్తం 240 టీఎంసీ (మెడిగడ్డ బ్యారేజ్ నుంచి 195, శ్రీపాడ యల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20, భూగర్భజలాల నుంచి 25) ఉత్పత్తి చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. వీటిలో 169 నీటిపారుదల కోసం, 30 హైదరాబాద్ మునిసిపల్ నీటికి, 16 ఇతర పారిశ్రామిక అవసరాలకు, 10 సమీప గ్రామాల్లో తాగునీరు వినియోగిస్తున్నారు. 21 జూన్ 2019న ఈ ప్రాజెక్టును అప్పటి తెలంగాణ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఫడ్నవీస్ , సీఎం జగన్ ప్రారంభించారు. నాలుగు ప్రధాన పంపింగ్ సదుపాయాలు ప్రాజెక్టు ప్రవాహాన్ని నిర్వహిస్తాయి.

Whats_app_banner