TG DSC 2024 Results : పూర్తికావొచ్చిన పరీక్షలు... ఆలోపే తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు..!-telangana dsc exams results are likely to be out in the last week of august 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc 2024 Results : పూర్తికావొచ్చిన పరీక్షలు... ఆలోపే తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు..!

TG DSC 2024 Results : పూర్తికావొచ్చిన పరీక్షలు... ఆలోపే తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 04, 2024 08:21 AM IST

Telangana DSC 2024 Results : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తి కానున్నాయి. ఆ వెంటనే కీ లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖారులనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు 2024
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు 2024

Telangana DSC 2024 Results : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు పూర్తి కానున్నాయి.  జులై 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు రేపటితో (ఆగస్టు 5) అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. 

ఈ క్రమంలోనే…. డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ చూస్తోంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది కీని ప్రకటించనుంది. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించనుంది.  సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత… నియామక పత్రాలను అందజేయనుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు చివరి వారంలోపే పూర్తి చేయాలని భావిస్తోంది. 

డీఎస్సీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగానే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు కొత్త టీచర్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవంలోపు రిక్రూట్ మెంట్ పూర్తి అవుతుందన్న విషయం చర్చకు వచ్చింది.

నిజానికి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గ్రూప్స్ పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ… డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. నిర్ణయించిన షెడ్యూల్ లోపే పరీక్షలను పూర్తి చేసి… కొత్త టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. మొత్తంగా చూస్తే… ఈ నెలాఖారులోపే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 18 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ  ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రోజుకు రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు.

మరో డీఎస్సీ నోటిఫికేషన్….!

టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అసెంబ్లీ వేదికగా తాజాగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికంటే ముందే అంటే నవంబరులో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని… జనవరిలో పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. 

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రస్తావించలేదు. దాదాపు ఈ నోటిఫికేషన్ ఆరు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారని సమాచారం. దీనిపై విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

Whats_app_banner