Telangana Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు
Telangana Cabinet Meeting Updates: ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలతో పాటు ఆరు గ్యారెంటీల హామీలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
Telangana Cabinet Meeting: ఆదివారం(ఫిబ్రవరి 4) తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల అంశంకు కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్దెట్ కాకుండా…. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. ఇదే సమావేశంలో ఆరు గ్యారెంటీల హామీలపై చర్చించనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పై ప్రకటన చేశారు. త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఈ రెండు అంశాలపై మంత్రివర్గంలో చర్చించి… ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ అంశాలే కాకుండా… పలు ముఖ్యమైన అంశాలపై కేబినెట్ చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు…!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 8 లేదా 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో కూడా సమావేశాలపై చర్చించనున్నారు. ఈసారికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు….
AP Assembly Session 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (Business Advisory Committee) సమావేశంలో నిర్ణయించనున్నారు.
ఇటీవలే ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్లపాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ డీఎస్సీతో పాటు మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సంబంధిత కథనం