August 25 Telugu News Updates: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి-telangana and andhrapradesh telugu live news updates on 25th august 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  August 25 Telugu News Updates: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి

ఏపీ తెలంగాణ వార్తలు

August 25 Telugu News Updates: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి

03:29 AM ISTAug 25, 2022 10:58 PM Mahendra Maheshwaram
  • Share on Facebook

  • బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. మరోవైపు ఈ నెలాఖరులోపు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం లైవ్ పేజీని అప్డేట్ చేయండి......

Thu, 25 Aug 202205:28 PM IST

వరంగల్‌ నిట్‌ లో లైంగిక వేధింపుల కలకలం

వరంగల్‌ నిట్‌ లో లైంగిక వేధింపుల కలకలం రేపింది. నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరన్‌పై కాజీపేట పీఎస్‌లో నిట్ మహిళా సెక్యూరిటీలు ఫిర్యాదు చేశారు. లైంగికంగా వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Thu, 25 Aug 202205:27 PM IST

ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు

రాష్ట్రానికి చెందిన ముగ్గురికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. 2022 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ విభాగం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 46 మంది ఈ అవార్డులను అందుకోనున్నారు. అవార్డులకు ఎంపికైన వారిలో మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.ఎన్.శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. సీబీఎస్ఈ కేటగిరీలో హైదరాబాద్ నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారావు ఎంపికయ్యారు.

Thu, 25 Aug 202205:25 PM IST

మునుగోడు ప్రచారానికి వెంకట్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. కోమటిరెడ్డి నివాసంలో సుమారు గంటపాటు చర్చించారు. వెంకట్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మునుగోడు అభ్యర్థి ఎంపికపై వెంకట్​రెడ్డి అభిప్రాయాన్ని అడిగారు. అభ్యర్థి ఎంపికలో అనుసరిస్తున్న విధానంపై మాట్లాడారు. అభ్యర్థి ఎంపికలో పార్టీ నిర్ణయానికి వెంకట్​రెడ్డి తెలిపారు.

Thu, 25 Aug 202205:22 PM IST

బీజేపీ సభకు అనుమతి రద్దు చేసిన ఆర్ట్స్ కాలేజీ

బీజేపీ సభకు హనుమకొండ ఆర్ట్స్​ కాలేజీ యాజమాన్యం అనుమతి రద్దు చేసింది. ఈనెల 27న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్​ కాలేజీలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

Thu, 25 Aug 202205:18 PM IST

గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి

తెలుగు భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నట్లు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భాషా వికాసానికి పాల్పడిన 40 మందిని సత్కరించనున్నట్లు వెల్లడించారు.

Thu, 25 Aug 202205:17 PM IST

బస్సులో 25 లక్షలు చోరీ

చిలకలూరిపేట మార్టూరు మధ్య ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. ఆంజనేయులు అనే ప్రయాణికుడికి చెందిన రూ.25 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. మార్టూరు వద్ద బాధితుడు టిఫిన్‌ కోసం బస్సులోంచి దిగాడు. అదే సమయంలో నగదు ఉన్న బ్యాగును దుండగులు పట్టుకెళ్లారు.

Thu, 25 Aug 202201:43 PM IST

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసు సస్పెండ్ న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పోలీసుల నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. దీంతో బండి సంజయ్ శుక్రవారం ఉదయం నుంచి మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర పున ప్రారంభం కానుంది. ఈనెల 27న మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది.

Thu, 25 Aug 202207:29 AM IST

జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు చెప్పిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా

సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులు

జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ.

జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది - సీజేఐ

ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? - సీజేఐ

రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం- సీజేఐ

వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు - సీజేఐ

వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు - సీజేఐ

జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం - సీజేఐ ఎన్వీ రమణ

వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు - సీజేఐ

ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండి - సీజేఐ

Thu, 25 Aug 202207:16 AM IST

నేతన్న నేస్తం నిధులు విడుదల

పెడన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేతన్న నేస్తం నిధులను విడుదల చేశారు. సొంత మగ్గం ఉన్న నేతన్నకు సాయం అందిస్తున్నామని అన్నారు. మంచి జరుగుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఎక్కడా అవినీతి, లంచాలు లేవని చెప్పారు. సామాజిక న్యాయం పాటించిన ఘటన వైసీపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు ప్రారంభానికి శ్రీకారం చుట్టుతామని తెలిపారు.

Thu, 25 Aug 202206:49 AM IST

మధ్యాహ్నం హైకోర్టు విచారణ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ చేయనుంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ లలిత కుమారి సెలవు కావడంతో మరో బెంచ్‌కు బదిలీ అయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత న్యాయస్థానం వాదనలు విననుంది.

Thu, 25 Aug 202206:18 AM IST

చంద్రబాబు నిరసన

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిరసనకు దిగారు. వైసీపీ దాడులను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అన్నా క్యాంటీన్ల వద్ద ఉన్నఎన్టీఆర్ ఫ్లెక్సీలను చించటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Thu, 25 Aug 202206:10 AM IST

కుప్పం కుస్తీ…

కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ పోటాపోటీ ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి బస్టాండ్ వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించేందుకు బయల్దేరింది.  ఎంపీ రెడ్డప్ప, భరత్ రోడ్డుపై బైఠాయించారు. అన్న క్యాంటీన్ల ఫ్లెక్సీల చించివేతపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Thu, 25 Aug 202205:23 AM IST

ఏపీ అధికారులతో కీలక భేటీ

రాష్ట్ర విభజన అంశాలు, పెండింగులో ఉన్న అంశాలపై ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ప్రధాని ఆదేశం మేరకు ఏపీ అధికారులతో కేంద్ర అధికారుల బృందం భేటీ కానుంది.

Thu, 25 Aug 202204:38 AM IST

కొత్తగా 10,725 కేసులు

దేశంలో  కొత్తగా 10,725 మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారిన పడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Thu, 25 Aug 202204:31 AM IST

వారిని జైలుకు పంపించాలి - రేవంత్ రెడ్డి

'మత విద్వేషాలు రెచ్చగొట్టి,తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్ మాటలు ధ్రువీకరిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లోని వాస్తవాలను మరుగున పరచడానికి తెరాస కృత్రిమంగా సృష్టిస్తున్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారితో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Thu, 25 Aug 202202:59 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. లారీ, జీపు​ ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లాలోని సిరా జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది.

Thu, 25 Aug 202202:42 AM IST

నేడు రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటన

నేడు రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొంగరకలాన్ లో ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

Thu, 25 Aug 202202:39 AM IST

నేడు వరంగల్ కు గవర్నర్ తమిళిసై

నేడు హనుమకొండ జిల్లాలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పర్యటించనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొననున్నారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా జిల్లాలో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Thu, 25 Aug 202202:39 AM IST

కృష్ణా జిల్లాకు సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు.

Thu, 25 Aug 202202:39 AM IST

గేట్లు ఎత్తివేత

ఎగువన వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి.

Thu, 25 Aug 202202:29 AM IST

నెలాఖరులోపు ప్రకటిస్తాం - రేవంత్ రెడ్డి

ఈ నెలాఖరులోపు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణపై ప్రియాంకగాంధీ ప్రత్యేక శ్రద్ద పెట్టారని… తెలంగాణకు అధిక సమయం ఇస్తానని ప్రియాంకగాంధీ చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు ఇవాళ గాంధీభవన్ లో నేతలు భేటీ అవుతున్నారు. మునుగోడు అభ్యర్థి విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు.

 

Thu, 25 Aug 202202:28 AM IST

ప్రియాంక గాంధీతో వెంకట్ రెడ్డి భేటీ

బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించామని వెంకట్​రెడ్డి తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన భేటీలో పార్టీకి సంబంధించిన చాలా విషయాలపై చర్చించామని తెలిపారు. కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు ప్రియాంక గాంధీ పలు సూచనలు చేశారని మీడియాతో చెప్పారు.

Thu, 25 Aug 202202:24 AM IST