Nizamabad Tax Dues: నిజామాబాద్‌లో మునిసిపల్ కార్పొరేషన్‌లో భారీగా పేరుకుపోయిన పన్నులు
Nizamabad Tax Dues: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.30 కోట్ల ఆదాయపు పన్నులు పేరుకుపోయాయి.
Nizamabad Tax Dues: నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొన్ని నెలలుగా మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది అసెంబ్లీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటంతో టాక్స్ కలెక్షన్ అటకెక్కింది.
ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతుండటంతో ఈ యేడాది పన్ను వసూళ్ల లక్ష్యం చేరుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలలు మాత్రమే ఉంది. కానీ పన్ను వసూళ్ల టార్గెట్ రూ.30 కోట్ల వరకు పెండింగ్ లో ఉంది.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్లను బట్టి బడ్జెట్ అంచనాలను రూపొందిస్తారు. నగరంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.45 కోట్ల పన్ను వసూళ్లు టార్గెట్ విధించగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.54 కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యం విధించుకున్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 82 వేల గృహ, వాణిజ్య సముదాయాల నుంచి ఈ మొత్తం వసూలు చేయలి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా తీసుకువచ్చిన `భువన్` యాప్ ద్వారా మరో 6 వేల సముదాయాలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.
అదనంగా గదులు నిర్మించినా, ఒక భవంతిపై మరో భవంతి నిర్మించినా ఈ యాప్ ద్వారా కార్యాలయం నుంచే గుర్తించి పన్ను సవరించే అవకాశముంది. ఈ విధంగా నిజామాబాద్ లో అదనంగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల కలెక్షన్ కొత్తగా గుర్తించారు. కానీ గత 9 నెలలుగా కేవలం రూ.25 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
ఎన్నికల్లో బిజీబిజీ...
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు ఎన్నికల పనుల్లోనే నిమగ్నమయ్యారు. కార్యాలయానికి సంబంధించిన పనులన్నీ పక్కన పెట్టి మొదటి ప్రాధాన్యత ఎన్నికలకు ఇచ్చారు. ఆ ప్రభావం పన్నువసూళ్లపై పడింది. అయితే ఎన్నికల విధులకు బిల్ కలెక్టర్లను మినహాయింపు ఇచ్చినా ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేకపోయారు. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని 60 డివిజన్‌లలో 28 మంది రెవెన్యూ సిబ్బంది, 16 మంది బిల్ కలెక్టర్లున్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు…
కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూళ్ల కోసం ప్రస్తుతం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక జోన్ 3, జోన్5 పరిధిలోకి వచ్చే మైనార్టీ ఏరియాలో ఇద్దరు ఆర్ఐలతో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. మార్చి నాటికి టార్గెట్ చేరుకుంటామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలోనే జీహెచ్ ఎంసీ తరువాత నిజామాబాద్ వసూళ్లలో ముందు వరసలో ఉందని, ఇదే పరంపర కొనసాగిస్తామని చెబుతున్నారు.
(మీసా భాస్కర్, నిజామాబాద్ ప్రతనిధి)