Singareni Elections : సింగరేణిలో మోగిన ఎన్నికల నగరా, అక్టోబర్ 28న పోలింగ్
Singareni Elections : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెలలో ఎన్నికల జరుగనున్నాయి.
Singareni Elections : సింగరేణిలో ఎన్నికల నగరా మోగింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్‌సీ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలైంది. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వివిధ కారణాలు, వరుసగా పండగల నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలు
సింగరేణి యాజమాన్యానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పుడే చేపట్టలేమని, మరింత గడువు కావాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. అక్టోబర్ లోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ గడువు దగ్గర పడడంతో ఎన్నికలు నిర్వహించలేమని సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ముందు సింగరేణి యాజమాన్యం తరఫున ఏఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. అసెంబ్లీ ఎన్నికలు, వరుస పండగలు కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపారు. కార్మికుల తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. 2019లోనే గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసిందని కోర్టుకు తెలిపారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదొక కారణంతో ఎన్నికలు వాయిదా వేస్తోందని వాదించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, పండగలు అంటూ మళ్లీ వాయిదా వేయడానికి సాకులు చెబుతున్నారని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు... సింగరేణి సంస్థ పిటిషన్ ను కొట్టి్వేసింది.
ఏడాదిగా న్యాయపోరాటం
గతంలో హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు అక్టోబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సింగరేణి డిప్యూటీ సీఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల కోసం ఏడాదిగా న్యాయ పోరాటం చేస్తున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. అక్టోబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో కార్మిక సంఘాలు ఎన్నికలపై దృష్టి పెట్టాయి.