Sangareddy Drugs: సంగారెడ్డిలో అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్ స్వాధీనం, కల్లు తయారీలో వినియోగం
Sangareddy Drugs: అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న నలుగురు యువకులు అల్ఫాజోలం తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు.
Sangareddy Drugs: అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని నలుగురు యువకులు కలిసి వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్నారు. ఆ భూమిలో కోళ్లఫారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో తయారుచేసిన అల్ఫాజోలంను లోకల్ కల్లు దుకాణాలలో విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ ప్రమాదకరమైన ఆల్ప్రాజోలం కలిపిన కల్లు స్లో పాయిజన్ వంటిది. ఆల్ప్రాజోలం కలిపిన కల్లు తాగే వ్యక్తులు దానికి బానిసలై తీవ్ర అనారోగ్యం పాలై చనిపోయే అవకాశం ఉంటుంది.
సంగారెడ్డి జిల్లా పోలీసులు డ్రగ్స్ తయారీ కేంద్రంపై సంయుక్తంగా దాడులు నిర్వహించి సుమారు రూ. కోటి విలువ గల 2. 6 కిలోల అల్ఫాజోలంను,అల్ఫాజోలం తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్వాధీనపరచుకొని,యంత్రాలు సీజ్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ వివరించారు. నిందితులు ప్రభాకర్ గౌడ్ పరారీలో ఉండగా,సాయికుమార్ గౌడ్ చర్లపల్లి జైల్లో ఉన్నాడు. మిగతా ఇద్దరు అంజిరెడ్డి,రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ....
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. గోసుకొండ అంజి రెడ్డి, ప్రభాకర్ గౌడ్,సాయికుమార్ గౌడ్ మరియు క్యాసారం రాకేష్ అనే నలుగురు వ్యక్తులు కలిసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామ శివార్లలో ప్రభాకర్ రెడ్డికి చెందిన వ్యవసాయ భూమిని 30 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు.
ఆ భూమిలో షెడ్ ఏర్పాటు చేసి కోళ్లఫారం నిర్వహిస్తూ దానిలో పకడ్బందీగా ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన గీసుకొండ అంజిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్వహించేవాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన క్యాసారం రాకేష్ గతంలో కెమిస్ట్ గా ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఇప్పుడు ఆ పరిజ్ఞానంతో అల్ఫాజోలం డ్రగ్ తయారు చేస్తున్నాడు. వీరితో పాటు ప్రభాకర్ గౌడ్,సాయికుమార్ గౌడ్ నలుగురు కలిసి డ్రగ్స్ తయారీ యూనిట్ ను నిర్వహిస్తున్నారు.
అల్ఫాజోలంను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ .…
సంగారెడ్డి జిల్లాకు చెందిన గీసుకొండ అంజి రెడ్డి బాలనగర్ లో ఆల్ప్రాజోలం తయారీకి కావలసిన ముడిపదార్ధాలను కొనుక్కొని తీసుకొని వస్తాడు. కాగా కెమిస్ట్ అయినటువంటి క్యాసారం రాకేశ్ సహాయంతో ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నారు. ఆ విధంగా తయారుచేసిన అల్ఫాజోలంను ప్రభాకర్ గౌడ్,సాయికుమార్ గౌడ్ హైదరాబాద్,సంగారెడ్డితో పాటు వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేవారు.
దీంతో పాటు లోకల్ కల్లు దుకాణాలలో కూడా అమ్మి డబ్బులు సంపాదించేవారు. ఈ రోజు పోలీసులు ఆల్ప్రాజోలం తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి సుమారు 1 కోటి విలువగల ఆల్ప్రాజోలం, ఆల్ప్రాజోలం తయారీ ముడిపదార్థాలు మరియు అందుకు ఉపయోగించిన యంత్రాలు సీజ్ చేసినట్లు వివరించారు.
అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరం
ఆల్ప్రాజోలం అనేది అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యం. 1 గ్రామ్ ఆల్ప్రాజోలంతో 300 లీటర్ల కల్లును తయారుచేయవచ్చు. ఆల్ప్రాజోలం కలిపిన కల్లు స్లో పాయిజన్ వంటిది. ఆల్ప్రాజోలం తయారీలో బెంజిల్, సైనైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తారు.
ఆల్ప్రాజోలం కలిపిన కల్లు తాగే వ్యక్తులు దానికి బానిసలై కిడ్నీ,కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో తీవ్ర అనారోగ్యం పాలై చనిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అనేక మంది యువకులు డ్రగ్స్/గంజాయి మాదకద్రవ్యాలకు అలవాటు పడి, వివిధ రకాల నేరాలు చేయడం జరుగుతుంది. ఈ డ్రగ్ మహమ్మారి మత్తులో అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
ఆల్ప్రాజోలం వంటి మత్తు పదార్ధాల తయారీ నిర్మూలనకై TG-NAB, జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, సంవత్సర కాలం నుండి 5 అల్ప్రాజోలం తయారీ కేంద్రాలను గుర్తించడం జరిగిందని ఎస్పీ వివరించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హెచ్‌టి తెలుగు)