Rythu Bima Scheme : రైతులకు అలర్ట్... 'రైతుబీమా' దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు
Rythu Bima Registrations:రైతు బీమాకు దరఖాస్తులకు గడువు ఆగస్టు 5న ముగియనుంది. అర్హులైన వాళ్లు ఈలోపు సంబంధిత అధికారులకు కావాల్సిన పత్రాలను సమర్పించాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Rythu Bima Insurance Scheme : రైతులు మరణించినపుడు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేదోడు కల్పించే రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించింది తెలంగాణ సర్కార్. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు... ఆగస్టు 5వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న వారి పాలసీలను రెన్యూవల్ చేయటంతో పాటు.... కొత్తగా అర్హులైన రైతులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేపటితో గడవు ముగియనున్న నేపథ్యంలో... అర్హత గల రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
అర్హతలు:
-18 ఏళ్లు నిండి 59ఏళ్లలోపు వయసున్నవారు మాత్రమే పథకంలో నమోదుకు అర్హులుగా ఉంటారు.
-ప్రస్తుతం వయసు నిండినవారిని, చనిపోయినవారి పేర్లను పథకంలోనుంచి తొలగించి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారివి చేరుస్తున్నారు.
- ఇప్పటికే ఈ పథకంలో నమోదైనవారు నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- జూన్ 18 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా పరిగణిస్తారు.
- ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలుండగా పేరు నమోదుచేసే రైతు స్థానికంగా ఉండాలి. - -
- పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్‌కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలి.
చట్టపరమైన వారసత్వం కలిగినవారు నామినీగా ఉండాలి. గతంలో పథకంలోని రైతుల పేరిట నమోదైన నామినీ చనిపోతే నామినీ పేరు మార్పునకు అవకాశం ఉంటుంది.
రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. కేవలం గుంట జాగ ఉన్న రైతుకు కూడా ఈ పథకంలో అవకాశం కల్పించడంతో పాటు బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రమాదం, సాధారణ మరణంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన సమయంలో బీమాసొమ్ము ఆర్థికంగా ఆదుకుంటుంది. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును అందిస్తోంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.2,271 చొప్పున చెల్లించగా గతేడాది.... రూ.3,556 చొప్పున చెల్లించింది.