Revanth Reddy : బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం ఖాకీలను ఉసికొల్పింది
బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు అంతిమ ఘడియలు మొదలయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను అక్రమ కేసులతో వేధించడాన్ని నిరసిస్తూ రెండు రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని చెప్పారు.
రాజ్ భవన్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణుల సహనానికి ప్రభుత్వాలు పరీక్షపెడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మా కార్యకర్తలు, నాయకుల పై విచాక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారన్నారు. ఆడబిడ్డలు అని కూడా చూడకుండా మహిళా నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్నారు. బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం తమ శ్రేణుల పైకి ఖాకీలను ఉసికొల్పిందని వ్యాఖ్యానించారు. అయినా.. పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో , దేశంలో నియంత పాలన అంతానికి కాంగ్రెస్ కదం తొక్కుతుంది. మా కార్యకర్తలు, నాయకుల పై లాఠీ ఛార్జ్ ను, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం నుంచే ఆందోళనలు కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైరతాబాద్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసి ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. బస్సు పైకి ఎక్కి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. .
ఖైరతాబాద్ కూడలి నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ వైపు వెళ్లారు. పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. రాజ్‌భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, సునీతారావు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లారు.
కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె ప్రతిఘంటించారు. పోలీసు కాలర్ పట్టుకుని లాగారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా కాంగ్రెస్ నేతలపై పోలీసుల తీరు సక్రమంగా లేదని ఈ సందర్భంగా రేణుకా చౌదరి ఆరోపించారు. ప్రజాస్వామ్యం కంఠం నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తా.. రాజ్‌భవన్ రహదారిపై వెళ్లే హక్కు తనకు ఉందన్నారు.