Love Astrology : లవ్ గురు.. జ్యోతిష్యం పేరుతో యువతికి 47 లక్షలు టోకరా
Crime News : ఓ వ్యక్తి.. లవ్ ఆస్ట్రాలజీ పేరుతో మోసాలు చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన యువతి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు.
కొంతమంది చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. జ్యోతిష్యాన్ని చూపించుకుంటారు. రేపు ఏం జరుగుతుందోనని భయంతో బతుకుతుంటారు. ఇదే కొంతమంది దొంగ జ్యోతిష్యులకు పెట్టుబడిగా మారింది. నమ్ముతున్నారు కదా అని అందినకాడికి దోచుకుంటున్నారు. చివరకు తప్పించుకుని తిరుగుతున్నారు. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ యువతి కూడా ఓ దొంగ జ్యోతిష్యుడిని నమ్మింది లక్షల్లో డబ్బులు పొగొట్టుకుంది. ఇక చేసేదేమీ లేక వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే జ్యోతిష్కుడితో పరిచయం కూడా ఆమెకు సోషల్ మీడియా(Social Media) వేదిక నుంచి అయింది.
పంజాబ్ లోని మెుహాలీకి చెందిన లలిత్ అనే వ్యక్తి జ్యోతిష్యం పేరుతో ఆన్ లైన్లో మోసాలు చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ యువతి కూడా అతడిని నమ్మింది. ఇన్ స్టా గ్రామ్ లో ఆస్ట్రాలజీ గురించి వెతుకుతుండగా.. లలిత్ గోపాల్ శాస్త్రి(ఆస్ట్రో గోపాల్) అనే పేరుతో ప్రొఫైల్(Profile) కనిపించింది. అందులో అతడి ఫోన్ నెంబర్ కూడా ఉంది. దీంతో అతడిని ఆమె సంప్రదించింది.
లవ్ ప్రిడిక్షన్, ఇతర సమస్యలు తెలుసుకునేందుకు అతడితో మాట్లాడింది. మెుదట రూ.32 వేలు ఇచ్చింది యువతి. కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, అవి చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని దాదాపు రూ.47.11 లక్షల దాకా లలిత్ మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఇక ఆ తర్వాత అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసు(Police)లను ఆశ్రయించింది. గత నెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లవ్ ఆస్ట్రాలజీ(Love Astrology) పేరుతో మోసం చేసిన లలిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్ లైన్లో మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. ఇంకా ఇలాంటి మోసాలు ఎన్ని చేశాడమే కోణంలో విచారిస్తున్నారు. నిందితుడి దగ్గర నుంచి 14 విలువైన మెుబైల్ ఫోన్స్.., రెండు డెబిట్ కార్డులు, చెక్ బుక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్(Punjab)కు చెందిన లలిత్.. తండ్రి గోపాల్ శాస్త్రి జ్యోతిష్యుడు. ఆయన ఇన్ స్టాగ్రామ్ ఐడీ(Instagram ID)ని నిర్వహిస్తున్నాడు. అదే ఐడీ ద్వారా తాను కూడా జ్యోతిష్యం చెబుతానని లలిత్ ఫోన్ నంబర్ ను ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే బాధితురాలికి అతడి ఫోన్ నెంబర్ దొరికింది. దీంతో మోసం చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఏవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్ స్పెక్టర్ హరిభూషణ రావు టీమ్ ఈ కేసు దర్యాప్తు చేసింది. నిందితుడు లలిత్ ను పంజాబ్ నుంచి అరెస్టు చేసి.. హైదరాబాద్(Hyderabad) తీసుకొచ్చారు.