TS Teachers Promotions Issue: కోర్టు వివాదంతో టీచర్స్ ప్రమోషన్స్‌కు బ్రేకులు
TS Teachers Promotions Issue: కోర్టు వివాదాల నేపథ్యంలో తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారానికి బ్రేకులు పడ్డాయి. ఉపాధ్యాయ పదోన్నతులకు కూడా టెట్‌ను తప్పనిసరి చేయాలంటూ కోర్టునాశ్రయించడంతో పదోన్నతుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.
TS Teachers Promotions Issue: తెలంగాణలో ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల పదోన్నతులు తాత్కలికంగా నిలిచిపోయినట్టు కనిపిస్తోంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలంటూ కొందరు టీచర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో .. టెట్ ఉత్తీర్ణులై, పదోన్నతి పొందేందుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో తగిన విద్యార్హతలతో స్కూల్ అసిస్టెంట్లు, గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతులకు సిద్ధమైన వారి ఆశలకు టెట్ నీళ్లు చల్లినట్టైంది. తాజా పరిణామాల నేపథ్యంలో పదోన్నతులపై ముందుకెళ్లడం సాధ్యం కాదని విద్యాశాఖ చెబుతోంది.
ఉపాధ్యాయ నియామకాలతో పాటు పదోన్నతులకూ టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి అదే ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. తాజాగా విద్యాశాఖ చేపట్టిన పదోన్నతుల్లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు ప్రస్తుతం కష్టమేనని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
యథావిధిగా బదిలీలు…
తెలంగాణలోని మల్టీ జోన్-1 (వరంగల్) 19 జిల్లాలతోపాటు మల్టీ జోన్-2 (హైదరాబాద్) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభంమయ్యింది. ఇది యథావిధిగా సాగుతుంది. అక్టోబరు 2 తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. టెట్ పేపర్2లో అర్హత తప్పనిసరి కావడంతో అది జరగకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తెలంగాణలో టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. టెట్ పాసై ఉపాధ్యాయులుగా చేరినవారు రాష్ట్రంలో 15 వేల మందికి మించరు. అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతులు లభించేవి. మరో 5,870 మంది స్కూల్ అసిస్టెంట్లు అయ్యేవారు. టెట్ నిబంధన వీరికి అడ్డంకిగా మారింది.
ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు ఉత్తీర్ణులు కావాలని తొలుత కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత 2019 వరకు గడువు పెంచుతూ పార్లమెంటు ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మరోసారి గడువు పెంచాలన్నా పార్లమెంటు ఆమోదం పొందాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంటు ఆమోదంతో గడువు ఇచ్చినా సీనియర్ ఉపాధ్యాయులకు టెట్‌లో అర్హత సాధించలేరనే అభిప్రాయం ఉంది. తమిళనాడులో సైతం ఇదే తరహా వివాదంలో అక్కడ ప్రమోషన్లను ప్రభుత్వం నిలిపివేసింది.