Vande Bharat Express : సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ రైలు.. జనవరి 15న ప్రారంభం -prime minister modi to inaugurate secunderabad vishakapatnam vande bharat train on january 15 virtually ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharat Express : సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ రైలు.. జనవరి 15న ప్రారంభం

Vande Bharat Express : సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ రైలు.. జనవరి 15న ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 10:32 PM IST

Vande Bharat Express : సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జనవరి 15న సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలుని ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా రైలుని ప్రారంభించనున్నారని తెలిపింది.

వందేభారత్ రైలుని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వందేభారత్ రైలుని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Vande Bharat Express : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకను అందజేయనుంది. జనవరి 15న సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 19న ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ పండుగ సమయంలో తెలుగు ప్రజలకు కానుక ఇచ్చేందుకు నాలుగురోజులు ముందుగానే ఈ రైలు ప్రారంభించనున్నారు.

జనవరి 15వ తేదీన ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది.

వందే భారత్‌ రైలును వారంలో ప్రతి రోజూ నడపాలని నిర్ణయించారు. ఉదయం విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. 20 నిమిషాల విరామం తర్వాత తిరిగి సికింద్రాబాద్‌లో బయలు దేరుతుంది. విజయవాడలో ఐదు నిమిషాల పాటు ఆగే రైలు, హాల్టింగ్ ఉన్న ప్రతి స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు ఆగుతుంది.

విశాఖపట్నం నుంచి ఉదయం 5.45కు బయలుదేరే రైలు రాజమండ్రికి 8.08కు చేరుతుంది. రెండు నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9.50కు విజయవాడ చేరుతుంది. 9.55కు విజయవాడలో బయల్దేరి మధ్యాహ్నం 12.05కు వరంగల్ చేరుతుంది. మధ్యాహ్నం 2.25కు సికింద్రాబాద్ చేరుతుంది. మరోవైపు ఖమ్మంలో కూడా వందే భారత్ రైలుకు హాల్ట్ కల్పించారు. ఖమ్మం స్టేషన్‌కు వందే భారత్ చేరుకునే సమయాన్ని రైల్వే శాఖ ఖరారు చేయాల్సి ఉంది.

వందేభారత్ రైలులో టిక్కెట్ల ధరలను రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. ప్రధాని రైలును ప్రారంభించే రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించరు. ప్రయాణికులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ప్రయాణ ఛార్జీలను కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వందే భారత్‌‌ ట్రైన్‌లో ఛైర్‌ కార్‌ టిక్కెట్‌ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్ల ధరలతో పోలిస్తే సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ప్రయాణానికి రూ.1770 వరకు ఉండే అవకాశం ఉంది. పన్నులతో కలిపి ఈ ధర పెరిగే అవకాశాలున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్‌ కార్‌లో ప్రయాణ టిక్కెట్ ధర రూ.3260కు పైగా ఉండే అవకాశాలున్నాయి.

IPL_Entry_Point