Munugode Posters : మునుగోడులో పోస్టర్ల కలకలం-phone type contract pe posters in munugode assembly campaign ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode Posters : మునుగోడులో పోస్టర్ల కలకలం

Munugode Posters : మునుగోడులో పోస్టర్ల కలకలం

B.S.Chandra HT Telugu
Oct 11, 2022 09:34 AM IST

Munugode Posters మునుగోడులో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాకలు చేసిన రోజే, రాత్రికి రాత్రి బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

<p>మునుగోడులో వెలసిన పోస్టర్లు</p>
<p>మునుగోడులో వెలసిన పోస్టర్లు</p>

Munugode Posters మునుగోడులో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరింది. గత ఆగష్టులో కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో తాజా ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీని వీడిన రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడులో బీజేపీ అగ్రనాయకత్వం సమక్షంలో భారీ బహిరంగ సభ సైతం కోమటిరెడ్డి నిర్వహించారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో సోమవారం భారీ ర్యాలీ నడుమ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన కొద్ది గంటల్లోనే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు అంతట పోస్టర్లు వెలిశాయి.

Komatireddy రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే ఆయన నియోజక వర్గంలో ప్రచారం ప్రారంభించారు. భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అడగడమే ఆలశ్యం అన్నట్టు స్పీకర్‌ దానిని అమోదించడం జరిగిపోయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ తరపున కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో ఒకరిపై ఒకరు ఆధిక్యాన్ని చూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడటం వెనుక కోట్ల రుపాయల కాంట్రాక్టులు ప్రభావం చూపాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సిఎం బొమ్మైకు వ్యతిరేకంగా జరిగిన ఫోన్‌ పే పోస్టర్ల తరహాలో కోమటిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఫోటోతో కాంట్రాక్ట్‌ పే అంటూ నియోజక వర్గం అంతటా వెలిశాయి. “రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డికి కేటాయించడం జరిగింది” అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ట్రాన్సక్షన్‌ ఐడి పేరుతో బీజేపీ 18వేలకోట్లు అంటూ పేర్కొన్నారు. ఆ పోస్టర్లో రూ.500కోట్ల బోనస్ అని రివార్డ్‌ గా చూపించారు. Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు Transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు రాత్రికి రాత్రి అంటించారు. పార్టీ మారినందుకు భారీగా లబ్ది చేకూరిందని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అది గోడ పత్రికలకు చేరడంపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.