Karimnagar District : తల్లిదండ్రుల గొప్ప మనసు..! చనిపోయిన కొడుకు వాటా గ్రామ పంచాయతీకి విరాళం
కరీంనగర్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన కొడుకు భూమి వాటాను గ్రామ పంచాయతీకి అప్పగించారు. కోటి రూపాయల విలువ చేసే ఎకరం ఆరు గుంటల భూమిని విరాళంగా ఇవ్వటంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
ఆస్తుల కోసం కన్నవారిని.. కట్టుకున్నవారిని… తోడబుట్టిన వారిని వదలకుండా గొడవలతో చంపడమో, చావడమో జరుగుతున్న రోజులవి…! ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో అక్షరజ్ఞానం లేని నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులకు అద్భుతమైన ఆలోచన వచ్చింది.
కడుపున పుట్టిన కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆయన వాటాకు వచ్చిన భూమిని గ్రామపంచాయతీకి అప్పగించారు. బడి గుడి వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి దోహదపడ్డారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన వృద్ద దంపతులు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్య పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నునుగొండపల్లికి చెందిన నునుగొండ రామవ్వ-లస్మయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు మల్లయ్య, రెండో కొడుకు సత్యనారాయణ చదువుకోకపోగా చిన్న కొడుకు ప్రభాకర్ ఇంటర్ వరకు చదివాడు. 2004 లో ప్రభాకర్ రోడ్డు ప్రమాదానికి గురై మంచంపట్టి అదే సంవత్సరం మార్చి 26న ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి ముందు ఎకరం భూమి కొనుగోలుకు బయానపెట్టాడు. కానీ డబ్బులు పూర్తిగా చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ కాకముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ భూమి అతని పేరిటనే ఉండాలని తల్లిదండ్రులతోపాటు తోడపుట్టిన అన్నలు సంకల్పించారు. ప్రభాకర్ వాటాకు వచ్చే కోటి రూపాయల విలువ చేసే ఎకరం ఆరు గుంటల భూమిని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు.
వాటర్ ట్యాంక్ ఏర్పాటు…!
ప్రభాకర్ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన స్మారకార్థం పేరెంట్స్ కోటి రూపాయల విలువ చేసే భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఎకరం ఆరు గుంటల భూమిలో ప్రాథమిక పాఠశాల, హనుమాన్ టెంపుల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ నిర్మించారు. కోటి రూపాయల విలువ చేసే భూమిని గ్రామ పంచాయతీకి ఇచ్చిన ప్రభాకర్ స్మారక స్తూపం పంచాయతీ పాలక వర్గం ఏర్పాటు చేసింది. కోటి రూపాయల విలువ చేసే భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు బడి గుడి ఏర్పాటుకు దోహదపడ్డ పేరేంట్స్ ను గ్రామస్థులు అభినందిస్తూ సన్మానించారు.
కొడుకు ఆశయాన్ని బతికించాం - తల్లిదండ్రులు
ఎదిగిన కొడుకు పెళ్ళీడు సమయంలో భూమి కొనుగోలుకు భయాన పెట్టి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆయన ఆశయాన్ని బతికించాలని సంకల్పించామంటున్నారు పేరెంట్స్. కొడుకు ప్రభాకర్ ఆశయానికి అనుగుణంగా భూమికి పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించి ఆయన వాటాకు వచ్చిన ఎకరం ఆరు గుంటల భూమిని గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయించామని రామవ్వ లస్మయ్య తెలిపారు. కొడుకు ఆశయం నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్నారు. తోబుట్టువులు ఇద్దరు సోదరులు సైతం తమ్ముని వాటా ఆయనకే చెందాలని గ్రామ పంచాయతీకి అప్పగించామని తెలిపారు. చనిపోయిన తమ్ముడు పేరు చిరస్మరణీయంగా ఉండాలని బడి గుడి వాటర్ ట్యాంక్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు తోపాటు గణేషుడి మండపం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఆస్తుల కోసం గొడవపడి ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో చనిపోయిన కొడుకు కోసం పేరెంట్స్, తోడపుట్టిన తమ్ముడు కోసం అన్నలు పడుతున్న ఆరాటం అభినందనీయం అంటున్నారు గ్రామస్తులు. ఆస్తులు ముఖ్యం కాదు ఆలోచన ఉండాలని సూచిస్తున్నారు. అక్షర జ్ఞానం లేకపోయినా పేరెంట్స్ ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారని గ్రామస్థులు అభిప్రాయ పడుతు అభినందనలు తెలుపుతున్నారు. ఆస్థుల కోసం తన్నుక సచ్చే జనం నునుగొండ రామవ్వ-లస్మయ్య దంపతులను స్పూర్తిగా తీసుకోవాలని జనం కోరుతున్నారు.