Paleru News : పాలేరులో గెలుపు ప్రతిష్టాత్మకం-రంగంలోకి గులాబీ బాస్-paleru constituency brs takes prestigious cm kcr came into the arena ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Paleru News : పాలేరులో గెలుపు ప్రతిష్టాత్మకం-రంగంలోకి గులాబీ బాస్

Paleru News : పాలేరులో గెలుపు ప్రతిష్టాత్మకం-రంగంలోకి గులాబీ బాస్

HT Telugu Desk HT Telugu
Oct 25, 2023 09:41 PM IST

Paleru News : తెలంగాణలో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పాలేరులో గెలుపును పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. పాలేరు బరిలో పొంగులేటి నిలిచే అవకాశం ఉండడంతో... బీఆర్ఎస్ పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలేరు సభలో పాల్గొంటున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

Paleru News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో పాలేరు ఒకటి. ఈసారి కీలక నేతలు పాలేరు బరిలో నిలుస్తు్న్నారు. దీంతో అందరి చూపు "పాలేరు"పై కేంద్రీకృతమైంది. ఈ క్రమంలోనే పాలేరు నియోజకవర్గంలో గెలుపును గులాబీ బాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తో పొత్తుల్లో భాగంగా సీపీఎం సైతం పాలేరు సీటునే ఆశిస్తోంది. అన్నింటికంటే ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఇక్కడ బడా కాంట్రాక్టర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ఈ స్థానంలో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది.

yearly horoscope entry point

పాలేరు గెలుపు ప్రతిష్టాత్మకం

పొంగులేటి ఖమ్మం ఎంపీగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మళ్లీ అదే ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో నాలుగున్నరేళ్ల పాటు పార్టీలో ఇమడలేని దుస్థితిని ఎదుర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తాన్ని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కాగా పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీకి నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆచితూచి అదే సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి ని అక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఖమ్మం జిల్లాలోని జనరల్ స్థానాల్లో ఒకటైన "పాలేరు" అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ గెలుపు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

27న సీఎం బహిరంగ సభ

తనకు సవాల్ విసిరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీకి దిగుతారని భావిస్తున్న "పాలేరు"ను ఎలాగైనా గులాబీ ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. కాగా ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న ఆయన గెలుపు సీఎం కేసీఆర్ కు సవాలుగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వంద నియోజక వర్గాల్లో పర్యటించదలచిన కేసీఆర్ ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 27వ తేదీన పాలేరు నియోజకవర్గ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. మరి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న "పాలేరు"లో గులాబీ జెండా ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్ సభ దోహదపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

రిపోర్టింగ్ : కాపార్తి నరేంద్ర, ఖమ్మం

Whats_app_banner