Occult worship : హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం…-occult worship in hyderabad outskirts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Occult Worship : హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం…

Occult worship : హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం…

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 02:15 PM IST

Occult worship హైదరాబాద్‌లో శివార్లలో శ్మశానంలో యువకుడు కాలి బూడిదవ్వడం కలకలం రేపింది. దీపావళి పండుగ రోజు శ్మశానంలో సగం కాలిన శవం వెలుగు చూడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం
హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం

Occult worship హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం రేపాయి. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో యువకుడి సగం కాలిన శవం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. శ్మశానవాటికలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన కాటికాపరి కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత నాలుగైదు రోజులుగా స్మశానంలో ఎలాంటి అంత్యక్రియలు జరగలేదని, పండుగ రోజు శవం కనిపించడంతో క్షుద్ర పూజలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హైదర్‌గూడ్‌ తలాబ్‌ శ్మశానవాటికలో ఓ యువకుడి మృతదేహం 60 శాతం పైగా కాలి ఉండటం కనిపించింది. ఉదయం పదిగంటలకు కాటికాపరి కుటుంబం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షుద్రపూజల కోసం చంపారా, బయటేచంపేసి శ్మశానికి తీసుకు వచ్చారా అని పరిశీలిస్తున్నారు.

గత నాలుగైదు రోజులు నలుగురైదుగురు రాత్రిపూట స్మశానంలో సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం సేవించేందుకు వచ్చి ఉంటారని భావించి స్థానికులు వారిని పట్టించుకోలేదు. దీపావళి పండుగ రోజు శవం కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.అమావాస్య,మర్నాడు సూర్య గ్రహణం ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హైదర్‌గూడలోజరిగినవి క్షుద్రపూజలు కాదని పోలీసులు చెబుతున్నారు. హైదర్‌గూడ శ్మశానంలో యువకుడి మృతదేహం ఎవరిదని తెలిస్తే మిస్టరీ వీడుతుందని చెబుతున్నారు. శ్మశానంలో 25-30ఏళ్ల మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులతో కలిసి యువకుడు అక్కడికి వచ్చి ఉండటమో, ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడ కాల్చివేయడమో చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

క్షుద్రపూజల ప్రచారాన్ని పోలీసులు కొట్టి పాడేశారు. దీపావళి తెల్లారితే అమావాస్య సూర్యగ్రహణం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పిండ ప్రదానం కోసం ఉంచిన పూజా సామాగ్రి చూసి స్థానికులు క్షుద్రపూజలుగా ఆందోళన చెందారని, అలాంటి ఆనవాళ్లేవి స్థానికంగా లభించలేదనిచెబుతున్నారు. మరోవైపు నగర శివారు ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న ఉదంతాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Whats_app_banner