Nizamabad Kendriya Vidyalaya : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ ను అనుకుని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ(Nizamabad Kendriya Vidyalaya) భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మంగళవారం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలోని ఐ.ఐ.ఎం నుంచి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind), ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.
నిజామాబాద్ లో 7.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 28 కోట్లు వెచ్చిస్తూ అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ(Nizamabad Kendriya Vidyalaya) నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని ఎంపీ అర్వింద్ చెప్పారు. పదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ విద్యా సంస్థలో... త్వరలోనే 12వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బోధన్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పనులను కూడా మరింత వేగవంతం చేసి వచ్చే ఏడాది నుంచి సొంత భవనం అందుబాటులోకి తెస్తామన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ... కేంద్రీయ విద్యాలయానికి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో నూతన భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల(Kendriya Vidyalaya) ద్వారా నాణ్యమైన విద్య అందుతోందని అన్నారు. అయితే నేటి రోజుల్లో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం మార్కులు, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నెలకొందని కలెక్టర్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పిల్లలు మానసిక వికాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నారని, సమాజంలో మన చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మానసిక దృఢత్వం కలిగి ఉంటే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా కూడా ప్రోత్సహిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు సరైన బాటలువేయాలని కలెక్టర్ హితవు పలికారు.
హెచ్.టి.తెలుగు రిపోర్టర్, నిజామాబాద్