NIA On PFI : పాపులర్ ఫ్రంట్‌పై దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు-nia arrests more then 150 popular front india members across the country ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nia Arrests More Then 150 Popular Front India Members Across The Country

NIA On PFI : పాపులర్ ఫ్రంట్‌పై దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు

HT Telugu Desk HT Telugu
Sep 23, 2022 08:09 AM IST

NIA On PFI జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ చరిత్రల్లో కనివిని ఎరుగని స్థాయిలో దేశ వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు, దాడులు, అరెస్ట్‌లు జరిగాయి. దేశంలో అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ కార్యాలయాలు, అనుబంధ విభాగాలపై ఏకకాలంలో సోదాలు, దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వందమందికి పైగా అరెస్ట్‌ అయ్యారు.

పాపులర్ ఫ్రంట్ కార్యాలయాల్లో సీజ్ చేసిన వస్తువుల్ని తరలిస్తున్న ఎన్‌ఐఏ బృందాలు
పాపులర్ ఫ్రంట్ కార్యాలయాల్లో సీజ్ చేసిన వస్తువుల్ని తరలిస్తున్న ఎన్‌ఐఏ బృందాలు (HT PHOTO)

NIA On PFI దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 15రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో వందమందిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు తెలంగాణలో ఒకరిని అరెస్ట‌‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తుండటంతో ఏమి జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

NIA On PFI విదేశీ నిధుల సహకారంతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో ఎన్‌ఐఏ గత కొద్ది రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్‌లో మొదట ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. అక్కడ శిక్షణ పొందిన వారు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వరుస దాడులు, సోదాలతో కీలక సమాచారాన్నిరాబట్టింది. ఈ నేపథ్యంలో ఏకకాలంలో దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది.

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాలు, సంస్థ సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బృందాలు దాడులు చేపట్టాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో 93 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 106 మందిని అరెస్టు చేశాయి.

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 300 మందికి పైగా అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఈ దాడులు ప్రారంభించారు. కేరళలో 22 మందిని అరెస్టు చేయగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 మంది చొప్పున అరెస్ట్‌ చేశారు. తమిళనాడులో 10 మంది, అసోంలో 9మంది, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పాపులర్‌ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న 19 కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ 5 కేసులకు సంబంధించి 45 మందిని గురువారం అరెస్టు చేసినట్టు ప్రకంటిం చింది. ఈ సోదాల్లో పలు పత్రాలను, ఆయుధాలను, ఇస్లామిక్‌ ఉగ్రవాద సాహిత్యాన్ని, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో పాపులర్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ ఒ.ఎం.ఎ.సలాం, ఢిల్లీ పాపులర్‌ ఫ్రంట్‌ చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌ కూడా ఉన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి నేరాలకు పాల్పడినట్టు చెబుతున్నారు.

దేశంలో అస్థిరతకు కుట్రలు….

2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల వెనుక, యూపీలోని హత్రాస్‌లో లో దళిత మహిళపై సామూహిక హత్యాచారం ఘటన నేపథ్యంలో మతవిద్వేషాలు రేపే కుట్ర చేశారని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. పాపులర్‌ ఫ్రంట్ బాధ్యులపై లఖ్‌నవూలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఒకటి గత ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసింది. హత్రాస్‌లో దళిత మహిళ సామూహిక హత్యాచారం అనంతరం మతవిద్వేషాలు రేపడానికి, పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యులు కృషి చేశారని అందులో పేర్కొంది. ఈ పనులకు అవసరమైన వనరుల కోసం మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించింది.

మరోవైపు పాపులర్ ఫ్రంట్‌పై ఎన్‌ఐఏ దాడుల్ని ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాద చర్యగా ఆ సంస్థ ఆరోపించింది. తమ సంస్థకు చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి, స్థానిక నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్ర కమిటీ కార్యాలయంపైనా దాడులు జరిగాయని ఒక ప్రకటనలో తెలిపింది. అసమ్మతి స్వరాలను అణచివేయడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్న నియంతృత్వ పాలనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో అరెస్టులు….

హైదరాబాద్‌ పాతబస్తీతోపాటు మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌లోని పాపులర్ ఫ్రంట్ కార్యాలయాల్లో NIA On PFI ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. చాంద్రాయణ గుట్టలోని పాపులర్ ఫ్రంట్ కార్యాలయంలో ఉదయం 3 గంటల నుంచి 7 గంటల దాకా సోదాలు చేసి కీలకపత్రాలు, హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ల్లో ఎన్‌ఐఏ, ఈడీ సోదాలు కొనసాగాయి. కరీంనగర్‌లోనే ఎనిమిది చోట్ల సోదాలు చేశారు. నిజానికి ఈ నెల 18న కరీంనగర్‌లోని హుస్సేనిపురలో ఒక ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. జగిత్యాలకు చెందిన మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ అనే కార్యకర్తను అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ని కర్నూలు నగరం పాతబస్తీలోని ఎస్‌డీపీఐ నేత అబ్దుల్‌వారిజ్‌ ఇంట్లో NIA On PFI ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఈ విషయం తెలిసి ఎస్‌డీపీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఎన్‌ఐఏ గోబ్యాక్‌, బీజేపీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. గుంటూరులో 30 మంది అధికారులు పీఎ్‌ఫఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు, సభ్యుల ఇళ్లు కార్యాలయాల్లో తనిఖీలు చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.

IPL_Entry_Point