Hyd Terror Links: హైదరాబాద్‌ టెర్రర్‌ లింకుల్లో కొత్త కోణాలు.. మరొకరి అరెస్ట్-new angles in hyderabad terror links police arrest another ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Terror Links: హైదరాబాద్‌ టెర్రర్‌ లింకుల్లో కొత్త కోణాలు.. మరొకరి అరెస్ట్

Hyd Terror Links: హైదరాబాద్‌ టెర్రర్‌ లింకుల్లో కొత్త కోణాలు.. మరొకరి అరెస్ట్

HT Telugu Desk HT Telugu
May 11, 2023 08:58 AM IST

Hyd Terror Links: ఉగ్రవాద కార్యకలాపాలతో హైదరాబాద్‌లో అరెస్టుల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మతమార్పిళ్లతో ఉన్నత విద్యావంతులు సైతం ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

మధ్య ప్రదేశ్‌ పోలీసులు అదుపలో తీసుకున్న అనుమానితులు
మధ్య ప్రదేశ్‌ పోలీసులు అదుపలో తీసుకున్న అనుమానితులు (PTI)

Hyd Terror Links: హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఉగ్రవాదుల వ్యవహారంలో రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. మరోవైపు ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థ​పై మధ్యప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టైన నిందితులు, అనుమానితుల ఫోన్ కాల్స్‌ వివరాలతో పాటు వాట్సాప్‌‌, సోషల్‌‌మీడియా అకౌంట్స్‌‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు. పోలీసుల దాడి నుంచి తప్పించుకుని పరారైన మహ్మద్‌‌ సల్మాన్‌‌‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మేడ్చల్ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మధ్యప్రదేశ్​కు తరలించారు.

మహ్మద్ సల్మాన్ మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​లోని శివాజీనగర్​లో ఉంటూ రోజుకూలీగా పని చేసేవాడు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు పథకం పన్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గోల్కొండలో సోదాలు జరిపారు. డెక్కన్ కాలేజీలో బయోటెక్నాలజీ హెవోడీగా ఉన్న మహ్మద్​ సలీం అలియాస్ సౌరభ్​రాజ్ వైద్య, సాఫ్ట్​వేర్ ఇంజినీర్ అబ్దుల్ రహమాన్ అలియాస్ దేవీప్రసాద్ పాండ, డెంటిస్ట్ షేక్​ జునైద్​లను అరెస్ట్ చేశారు.

దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన ఉగ్రవాద సంస్థ హెచ్‌యూటీ వలకు అనేక మంది చిక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత మార్పిళ్ల ద్వారా యువతను ఆకర్షించి తర్వాత వారిని విధ్వంసకారులుగా మార్చడమే లక్ష్యంగా హెచ్‌యూటీ సంస్థ పనిచేస్తున్నట్లు గుర్తించారు.

మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టయిన వారితో ఇంకా ఎవరెవరు సంప్రదింపులు జరిపారన్న దానిపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో అరెస్టైన నిందితులు బయాన్‌ పేరిట నిర్వహించే సమావేశాలకు చాలా మంది హాజరయ్యేవారిని, ఇందులో ఇతర జిల్లాల వారు కూడా ఉన్నట్లు గుర్తించారు.

మంగళవారం పోలీసులు దాడి చేసిన సమయంలో పరారైన మహ్మద్‌ సల్మాన్‌ను బుధవారం అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్‌లో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. మధ్యప్రదేశ్‌ పోలీసులు మంగళవారం ఏకకాలంలో భోపాల్‌, హైదరాబాద్‌లలో నిర్వహించిన దాడుల్లో హెచ్‌యూటీకి చెందిన 16 మందిని అరెస్టు అయ్యారు.

ఎన్‌ఐఏ అదుపులో ఉగ్రవాదులు, హైదరాబాద్‌తో లింకులు
ఎన్‌ఐఏ అదుపులో ఉగ్రవాదులు, హైదరాబాద్‌తో లింకులు (PTI)

ఉన్నత విద్యావంతులకు వల…

ప్రధాన నిందితుడైన మహ్మద్‌ సలీం అలియాస్‌ సౌరభ్‌రాజ్‌ 2018లో భోపాల్‌ నుంచి నగరానికి వచ్చాడు. ఓ వ్యాపారవేత్త సిఫార్సుతో ప్రముఖ వైద్య కళాశాలలో ఉద్యోగం సంపాదించాడు. ఏడాది క్రితం గోల్కొండ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని భార్య, ఆరుగురు పిల్లలతో ఉంటున్నాడు.

భోపాల్‌ నుంచి సలీం హైదరాబాద్‌ వచ్చాకే హైదరాబాద్‌లో ఆ సంస్థ కార్యకలాపాలు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో అరెస్టయిన ఆరుగురు.. బయాన్‌ పేరుతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారని, ఇవి క్కువగా సలీం ఇంట్లోనే జరిగేవని పోలీసులు చెబుతున్నారు. నిందితులు తమ కార్యకలాపాలు బయట పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకునేవారు.

జగద్గిరిగుట్టలో అరెస్టైన కూలీ మహ్మద్‌ హమీద్‌ తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వెళ్లి మళ్లీ రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేవాడని, ఇతని గురించి చుట్టుపక్కల వారికి కూడా ఏమీ తెలియదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారంతా తమ వ్యక్తిగత వివరాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడేవారు.

నిందితులు నిర్వహించిన సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యేవారనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితుల దగ్గర స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరికొందర్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. చదువుకున్నవాళ్లు, ధనవంతులు మాత్రమే ఎక్కువగా హెచ్‌యూటీలో సభ్యులుగా ఉండేవారని, ఈ సంస్థలో సభ్యత్వం అందరికి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు.

విద్యావంతులకు వల వేసేందుకే…

ఉగ్ర దాడులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఆకర్షించేందుకే సౌరభ్ రాజ్‌ హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్ర దాడులకు కొత్త మార్గాలను అన్వేషించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఆకర్షించడానికి పథకం రచించినట్లు భావిస్తున్నారు. మెడికోలను ట్రాప్​ చేసేందుకే భోపాల్​కు చెందిన మహ్మద్ సలీం డెక్కన్ కాలేజీలో చేరినట్లు అనుమానిస్తున్నారు.

మతం మార్చుకుని ఉగ్రవాదం వైపుకు మళ్లారా..?

భోపాల్​కు చెందిన మాన్సీ అగర్వాల్​కు 2009లో సౌరబ్ రాజ్​తో పెళ్లైంది. సౌరబ్ అప్పటికే ఇస్లామ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఇంట్లో నమాజ్ చేస్తూ ఉండేవాడు. దీనిపై ఇద్దరి మధ్య మొదట్లో గొడవ జరిగేది. 2010లో సౌరబ్ ఇస్లామ్​‌లోకి మారాడు. దీంతో మాన్సీ అగర్వాల్ కూడా మతం మారాల్సి వచ్చింది. సౌరబ్ రాజ్ తన పేరును మహమ్మద్ సలీంగా మార్చుకున్నాడు. మాన్సీ పేరు మహ్మద్ రహీలగా మార్చుకుంది. ఓ ఇస్లామిక్ కోర్స్ కోసం ఇద్దరు దంపతులు 2018లో హైదరాబాద్ వచ్చారు. గోల్కొండలో నివాసం ఉంటున్నారు. డెక్కన్ కాలేజీలో ఐదేళ్లుగా హెచ్​వోడీగా పని చేస్తున్నాడు.

గోల్కొండ బడాబజార్​లో ఉంటున్న సలీం, డెంటిస్ట్ షేక్ జునైద్, అబ్దుల్ రహమాన్ కలిసి మెడికోలను ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సలీం నెట్​వర్క్​పై ఆరా తీస్తున్నారు. దీని కోసం రాష్ట్ర పోలీసులు భోపాల్ వెళ్లారు. రహమాన్​ ఎంఎన్​సీ కంపె నీలో క్లౌండ్​ సర్వీస్​ ఇంజినీర్​గా పని చేస్తుండటంతో ఐటీ ఉద్యోగులను ట్రాప్​ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టెకీలను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేసిన ఆధారాలు లభించినట్లు సమాచారం. వీకెండ్స్​లో ఔట్​డోర్ ట్రైనింగ్ పేరుతో భోపాల్, మహారాష్ట్ర, బెంగళూరుకు తీసుకెళ్లినట్లు గుర్తించారు.