Kumbam Anil Kumar Reddy : మళ్లీ కాంగ్రెస్ గూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రసవత్తరంగా భువనగిరి పాలిటిక్స్!-nalgonda bhuvanagiri kumbam anil kumar reddy again joins congress resigns brs ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Nalgonda Bhuvanagiri Kumbam Anil Kumar Reddy Again Joins Congress Resigns Brs

Kumbam Anil Kumar Reddy : మళ్లీ కాంగ్రెస్ గూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రసవత్తరంగా భువనగిరి పాలిటిక్స్!

HT Telugu Desk HT Telugu
Sep 25, 2023 08:19 PM IST

Kumbam Anil Kumar Reddy : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

కుంభం అనిల్ కుమార్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
కుంభం అనిల్ కుమార్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ

Kumbam Anil Kumar Reddy : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే దాకా పార్టీలో ఈ పరిణామాలు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు చొప్పున టికెట్లు ఆశిస్తున్న నేతల్లో అత్యధికులు దిల్లీకి చేరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. నకిరేకల్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం ఆ పార్టీలో చేరిక కోసం, జాతీయ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు దిల్లీలోనే మకాం పెట్టారు. ఇప్పుడు మరో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. నెల రోజుల కిందటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది?

కుంభం అనిల్ కుమార్ రెడ్డి మొన్నటి దాకా భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనిల్ కుమార్ రెడ్డి ఓటమి పాలైనా.. 61 వేల పైచిలుకు ఓట్లు సంపాదించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఆయనకు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. వెంకటరెడ్డితో పొసగని అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆ మరుక్షణమే గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనను 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ ఎంపీ అభ్యర్థిగా పోటీకి పెట్టాలని నిర్ణయించుకుని ఆ మేరకు హామీ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి అనుచరునిగా పేరుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు చేప్టటాక కూడా రేవంత్ తో మంచి సంబంధాలే కొనసాగించారు. కానీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పొసగక బయటకు వచ్చారు. కానీ, ఇంతలోనే తిరిగి తన సొంత గూటికి చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పావులు కదిపిన రేవంత్ రెడ్డి

డీసీసీ అధ్యక్షుని స్థాయి నాయకుడు, మరో నేతతో వేగలేక పార్టీని వీడి, బీఆర్ఎస్ బాట పట్టిన వైనం గురించి ఏఐసీసీ నాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. తిరిగి ఆయనను పార్టీలోకి తీసుకురాగలిగితే బీఆర్ఎస్ కు షాకివ్వడమే కాకుండా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపొచ్చన్న అంచనాతో పీసీసీ అధ్యక్షునికే ఆ బాధ్యత అప్పజెప్పారు. దీంతో ఆయన కుంభం అనిల్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుంభం అనిల్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇంకా ఎలాంటి బహిరంగ ప్రకటన అనిల్ కుమార్ రెడ్డి వైపు నుంచి వెలువడకున్నా.. దగ్గరి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఇప్పటికే తాను వెనక్కి వస్తున్నట్లు, వచ్చే ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ సీటు నుంచే పోటీ చేయనున్నట్లు సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ చేరిక జరిగితే తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల మధ్య జరుగుతున్న ఆదిపత్య పోరు మరో లెవల్ కు చేరినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన తిరిగి కాంగ్రెస్ చేరుతున్నట్లు కుంభం అనిల్ ప్రకటించారు.

పారని కోమటిరెడ్డి పాచిక

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరున్ని పోటీ చేయించాలని ఇప్పటికే ఇద్దరు బీసీ నాయకులను ప్రోత్సహిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఒక విధంగా పొగబెట్టినట్టే. అంతే కాకుండా తాను అనుకున్న నాయకుడు, తన అనుచరునికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా ఇప్పించుకోగలిగారు. కానీ, ఆయన సాగనంపిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి పార్టీలోకి రావడం కోమటిరెడ్డికి మింగుడు పడని అంశమే కానుంది.

జిట్టా ఎట్టా?

మరో వైపు బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఈ నెల 16వ తేదీననే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి తన లక్ ను పరీక్షించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో జిట్టా బాలక్రిష్ణా రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ( తన సొంత పార్టీ యువ తెలంగాణ తరపున, బీజేపీ మద్దతుతో) ఎన్నికల బరిలోకి దిగినా కేవలం 13 వేల ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పటికే ఆయన మూడు పర్యాయాలు ఇండిపెండెంటు అభ్యర్థిగానే పోటీ చేశారు. ఎన్నిక ఎన్నికకు ఆయన ఓట్ల గ్రాఫ్ పడిపోయింది. ఈ సారి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించి పార్టీలో చేరితే... ఇపుడు టీపీసీసీ నాయకత్వం ఏరి కోరి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని వెనక్కి తీసుకురావడం అంటే జిట్టా బాలక్రిష్ణారెడ్డి టికెట్ కు దారులు మూసుకుపోయినట్లేనని విశ్లేషిస్తున్నారు.

రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ

WhatsApp channel