Mynampally Hanumanth Rao : బీఆర్ఎస్‍కు మైనంపల్లి రాజీనామా
Mynampally Hanumanth Rao : మైనంపల్లి హన్మంతరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Mynampally Hanumanth Rao : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మంత్రి హరీశ్‌రావుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్ తో పాటు పార్టీలోని ముఖ్య నేతలంతా ఖండించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్కాజ్ గిరి తో పాటు మెదక్ సీట్లకు అడిగారు మైనంపల్లి. అయితే ఇందుకు బీఆర్ఎస్ అధిష్టానం నిరాకరించింది. కేవలం మల్కాజ్ గిరి స్థానాన్ని మాత్రమే మైనంపల్లికి కేటాయించింది. దీంతో హర్ట్ అయిన మైనంపల్లి... బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వకపోతే స్వతంత్రులుగా రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అంతకు ముందు మెదక్ లో కల్పించుకున్నందుకు మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. షోకాజ్ నోటీసులను కూడా జారీ చేసింది.
మంత్రి హరీశ్ రావుపై సీరియస్ కామెంట్స్ చేసిన తర్వాత… కొద్దిరోజుల పాటు మీడియాతో మాట్లాడలేదు మైనంపల్లి. హైదరాబాద్ చేరుకున్న అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్‌లో అణచివేతకు గురి అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల కోసం మారే వ్యక్తిని కాదన్నారు. తన కొడుకు కోవిడ్ సమయంలో రూ.8 కోట్లు పెట్టి ప్రజలకు సాయం చేశారన్నారు. తను కుమారుడు మెదక్ నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తాను ఓడిపోయానని, ఓటమితో వెనుకాడే వ్యక్తిని కాదన్నారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానన్నారు. మెదక్ తనకు రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. తనను ఎవరు ఇబ్బంది పెడితే వారినే తిడతానన్నారు. వ్యక్తిగతంగా తాను ఎవరిని తిట్టనన్నారు. వారం తర్వాత మీడియాతో మాట్లాడతానని స్పష్టం చేశారు. తొందరపడి మాట్లాడవద్దని కొందరు సూచించారని, అందుకే వారం రోజులు ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు.
మీడియా ముందుకు మైనంపల్లి ఎప్పుడు వస్తారనే చర్చ నడుస్తుండగానే…. ఆయన బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు వీడియోను విడుదల చేశారు. ఇక ఆయన కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.