BJP Leader Murder: యూసఫ్‌గూడాలో బీజేపీ నాయకుడి హత్య.. వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు..
BJP Leader Murder: హైదరాబాద్ యూసఫ్‌గూడా ఎల్‌ఎన్ నగర్ లో బీజేపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబందం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
BJP Leader Murder: యూసఫ్‌గూడాలో జరిగిన బీజేపీ నాయకుడి హత్య కలకలం సృష్టించింది. పదిమంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ప్రైవేట్ పార్ట్శ్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి హతమార్చారు.
వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సింగొటం రాము గత కొన్నేళ్లుగా యూసఫ్ గూడలో ఎల్‌ఎన్ నగర్‌లో అద్దెకు నివాసం ఉంటున్నారు. భార్య, కూతురు నాగర్ కర్నూల్ జిల్లాలోని స్వగ్రామంలో నివాసం ఉంటున్నారు.
రాము బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాము అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి కిరాతకంగా హత్య చేశారు. ప్రైవేట్ భాగాలను కట్ చేయడంతో పాటు గొంతు కోసి హత్య చేశారు.
అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా రాము హత్యకు వివాహేతర సంబంధమే కారణం అయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని వారు చెబుతున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. హత్యకి అక్రమ సంబంధమే కారణమా? లేక ఇంకా వేరే పొలిటికల్ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి....
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో మెట్రో పిల్లర్ని ఢీ కొట్టి మృతి చెందిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లా లక్షణ చంద్ర మండలానికి చెందిన సిరిపురం నిఖిల్ (21) బాపునగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ.... సెల్‌ఫోన్ రిపేరింగ్ కోర్స్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈఎస్ఐ నుండి ఎస్సార్ నగర్ వైపు బైక్ పై వస్తున్నాడు.
బాపునగర్ వద్ద ముందు వెళుతున్న కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిచగా వాహనం అదుపు తప్పి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ లో అమీర్పేటలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నిఖిల్ రాత్రి 11:30 గంటలకు మరణించాడు. మృతుడు తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి…
వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం లచ్చంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ రామవ్వ (75) అనే వృద్ధురాలు పై ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి ముందు కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో మొహం, చేతులపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేసి గాయపరిచాయి.
గమనించిన గ్రామస్తులు వీధి కుక్కలను వెంటపడి తరిమి వేశాయి. తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు రమవ్వను గ్రామస్తులు కామరెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా... అక్కడి వైద్యులు నిజమాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. గ్రామంలో విచ్చలవిడిగా వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులు వాటిని నివారించే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)