Mother Suicide: కొడుకు మృతితో తల్లి ఆత్మహత్య, ఏడు నెలల్లో ముగ్గురి మృతితో మెట్‌పల్లిలో విషాదం
Mother Suicide: మానసిక వికలాంగుడైన కొడుకు మృతితో తల్లి తల్లడిల్లిపోయింది. కొడుకుతో పాటే తనువు చాలించింది. అనారోగ్యంతో కొడుకు మృతిచెందడంతో కన్నతల్లి తట్టుకోలేక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏడు మాసాల క్రితం భర్త, ఇప్పుడు తల్లి కొడుకు... ఒకే ఇంట్లో ముగ్గురు మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
Mother Suicide: మానసిక వికలాంగుడైన కొడుకు మృతితో తల్లి తల్లడిల్లిపోయింది. కొడుకుతో పాటే తనువు చాలించింది. అనారోగ్యంతో కొడుకు మృతిచెందడంతో కన్నతల్లి తట్టుకోలేక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏడు మాసాల క్రితం భర్త, ఇప్పుడు తల్లి కొడుకు... ఒకే ఇంట్లో ముగ్గురు మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఈ విషాదకరమైన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో జరిగింది. మల్లయ్య కనుకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఏడు నెలల క్రిత్రం మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కొడుకు వేరుగా ఉంటుండగా మాటలురాని మానసిక వికలాంగుడైన రాజయ్య తో కనుకమ్మ కలిసి ఉంటుంది.
ఇటీవల రాజయ్య అనారోగ్యానికి గురి కావడంతో తల్లి మానసిక వేదనకు గురయ్యింది. అనూహ్యంగా కొడుకు రాజయ్య ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో తల్లి నోరు మూగబోయింది. ఇక కొడుకు లేని జీవితం తనకెందుకు అనుకున్నదో ఏమో...ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లో కొడుకు శవం ఉండగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
అదృశ్యమై బావిలో శవమై తేలిన తల్లి…
రాత్రి నిద్రపోయిన తల్లి కొడుకు ఇద్దరు తెల్లవారే సరికి శవమై తేలారు. అనారోగ్యంతో ఉన్న కొడుకు రాజయ్య నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడంతో తల్లి కనుకవ్వ ఎవ్వరికీ చెప్పకుండా అదృశ్యమై పోయింది. ఉదయం అమ్మ, తమ్ముడి అలజడి వినిపించకపోవడంతో పెద్దకొడుకు ఇంట్లోకి వెళ్ళి చూడగా మంచంలోనే తమ్ముడు చనిపోయి ఉన్నాడు. అమ్మ కోసం వెతకగా ఆచూకి లభించలేదు.
చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. తల్లి ఏమైందని గ్రామస్థులంతా కలిసి ఆరా తీసిన జాడ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీయగా... మానసిక వికలాంగుడైన కొడుకు చనిపోతే తాను బతకలేనని పలుమార్లు అన్నట్లు స్థానికులు క్లూ ఇచ్చారు.
అయితే కొడుకు మృతితో తల్లిడిల్లిపోయిన తల్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బావించి ఇంటీ సమీపంలోని వ్యవసాయ బావి వైపు చూశారు. అడుగు జాడతో బావిలో వెతికారు. నిండనీళ్ళు ఉన్న బావి మోటార్లు ఆన్ చేసి నీళ్ళను ఎత్తిపోయగా బావిలో కనకవ్వ శవం బయటపడింది. కొడుకు మృతిని తట్టుకోలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని నిర్థారణకు వచ్చారు.
అనారోగ్యంతో తండ్రీకొడుకులు.. ఆత్మహత్యతో తల్లి...
అనారోగ్యం ఆ ఇంట శాపంగా మారింది. మాటలు రాని మానసిక వికలాంగుడైన కొడుకును తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. తండ్రీ మల్లయ్య ఏడు మాసాల క్రితం మృతి చెందగా తల్లికొడుకు మానసిక ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం మానసిక వికలాంగుడైన చిన్నకొడుకు అనారోగ్యపాలై కోలుకోక ప్రాణాలు కోల్పోవడంతో తల్లి ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. ఏడు మాసాల్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)