Minister KTR : రైతులు ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
Minister KTR On Rains: రాష్ట్రంలోని రైతులకు కేసీఆర్ సర్కార్ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. పంట నష్టం నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Farmers Suffer Crop Damage Due to Unseasonal Rains: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల దాటికి భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. రైతన్నలు లబోదిబో మంటున్నారు. అయితే అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.
రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ మద్యనే కురిసిన ఆకాల వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం రాష్ర్టంలో ఉందని కేటీఆర్ చెప్పారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, రైతులకు అండగా కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రంగానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షం అన్నదాతల ఉసురుతీసినట్లు అయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే తరుణంలో తడిసి ముద్దైపోవటంతో లబోదిబో మంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చాలాచోట్ల ధాన్యం కూడా తడిసిపోయింది. ఫలితంగా అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల వరికోతలు పూర్తై కల్లాల్లో ధాన్యం ఉన్నాయి.
మంత్రి విస్మయం…
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. 213 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంత తక్కువ సేకరించడం ఏమిటంటూ అధికారులను ఆయన నిలదీశారు. ధాన్యం కొనుగోళ్ళకు ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొనుగోళ్లు వేగవంతం చెయ్యక పోతే చర్యలు తప్పవంటూ ఆయన అధికారులను హెచ్చరించారు. జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం ఎందని ఆయన అధికారులను ప్రశ్నించారు. అదే సమయంలో అటు రైస్ మిల్లర్లు ఇటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించ రాదని ఆయన పేర్కొన్నారు. సరిపడ హామీలీలను యుద్ద ప్రాతిపదికన నియమించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.నాణ్యత ప్రమాణాల పేరుతో కోతలు వలదని ఆయన సూచించారు. అదే సమయంలో రైతులకు నాణ్యత అంశంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుందన్నారు.అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు అధికారులు బాసటగా నిలబడాలని అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.
సంబంధిత కథనం