Rains In Hyderabad: హైదరాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ-untimely rains that flooded hyderabad another four days of rains across telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Untimely Rains That Flooded Hyderabad, Another Four Days Of Rains Across Telangana

Rains In Hyderabad: హైదరాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

HT Telugu Desk HT Telugu
Apr 26, 2023 07:18 AM IST

Rains In Hyderabad: అకాల వర్షాలు హైదరాబాద్‌ నగరాన్ని ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాాద్‌లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాాద్‌లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ (unsplash.com)

Rains In Hyderabad: తెలంగాణలో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో వడగండ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మంగళవారం పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​లో రాళ్లవాన పడొచ్చని హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. కామారెడ్డిలోని లింగంపేట, సిరిసిల్లలోని వీర్నపల్లిల్లో 5.6, సిద్దిపేటలోని మిరుదొడ్డిలో 5.3, మెదక్​లోని చేగుంటలో 4.9, కొత్తగూడెంలోని దుమ్ముగూడెంలో 4.7, ఆసిఫాబాద్​లోని​ సిర్పూర్​లో 4.7, నిజామబాద్​లోని​ కోటగిరిలో 4.5, వికారాబాద్​లోని బంట్వారంలో 4.4, జగిత్యాలలోని మల్లాపూర్​లో 3.6, ఖమ్మంలోని బోనకల్​లో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

నిన్న మొన్నటి వరకు ఎండ వేడి, అధిక ఉష్ణోగ్రతలు భయపెడితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్ష ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండలోని నిడమనూరులో 40.6, మహబూబాబాద్​లోని మరిపెడలో 40.4, నాగర్​కర్నూల్​లోని కొల్లాపూర్​లో 39.9, ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 39.8, భద్రాద్రి కొత్తగూడెంలోని జూలూరుపాడులో 39.7 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అకాల వర్షం కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. రాంచంద్రాపురం-7.98, గచ్చిబౌలి-7.75, గాజులరామారం-6.5, కుత్బుల్లాపూర్‌-5.55, జీడిమెట్లలో 5.33 సెం.మీ వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ పరిధిలోనూ దాదాపు అదే మోతాదులో వర్షం కురిసింది. నడి వేసవిలో ఇంత భారీ వర్షం పడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. 2015లో ఏప్రిల్‌ 12న అత్యధికంగా 6.1 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డు నమోదైంది. వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచిన గాలులు నగరవాసులను వణికించాయి.

అకాల వర్షంతో పాటు గాలుల వేగానికి హైదరాబాద్‌లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు., హోర్డింగులు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గంటలపాటు నగరంలోని అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల ప్రాంతంలో మెట్రోజోన్‌లో 89 ఫీడర్లు ట్రిప్‌ అయినట్లు అధికారులుతెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో 22 ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించగా, మిగిలినవి మరమ్మతు దశలో ఉన్నాయి. విద్యుత్‌ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్టిజన్లు సమ్మెలో ఉండటంతో సరఫరా పునరుద్ధరణలో సమస్యలు తలెత్తాయి.

గోడ కూలి చిన్నారి మృతి….

వాన తీవ్రతకు ప్రధాన రహదారులపై నీరు భారీగా చేరడంతో ఆబిడ్స్‌, లక్డీకాపూల్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌ రోడ్‌ నం12, కూకట్‌పల్లి, మియాపూర్‌ మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిల్చిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌ ఓంనగర్‌లో గోడకూలి 8 నెలల చిన్నారి జీవనిక మృత్యువాత పడింది. నిర్మాణంలో ఉన్న ఇంటికి సంబంధించిన పిల్లర్‌ రేకులు, ఇటుక పెళ్లలు పొరుగూనే ఉన్న రేకుల ఇంటిపై పడడంతో గోడకూలి చిన్నారి మరణించింది.

ఆర్సీపురం, గచ్చిబౌలి, గాజులరామారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే 5 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు హుస్సేన్ సాగర్ లో భాగమతి బోట్ ఒక పక్కకు కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోట్ లో 40 మంది టూరిస్టులు ఉన్నారు. అదృష్టవశాత్తూ బోట్ ఒడ్డుకు తిరిగి రావడంతో ప్రమాదం తప్పింది. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో నగరంలో వరద ఉధృతంగా ఉంటే 040–-29555500 నంబర్ కు కాల్ చేయాలని ఈవీడీఎం అధికారులు సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు….

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రాన్ని వడగండ్ల వానలు వణికిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం మరోసారి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వడగండ్ల వర్షానికి ఉత్తర తెలంగాణ అతలాకుతలమైంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. కొన్నిచోట్ల టెన్నిస్ ​బాల్​​సైజులో పడిన వడగండ్ల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో వడ్లన్నీ రాలిపోయాయి. ఇప్పటికే కోసి కొనుగోలు సెంటర్లు, రోడ్ల వెంట ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. చాలా చోట్ల వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

గాలిదుమారం కారణంగా అనేక ప్రాంతాల్లో పెద్ద చెట్లు, కరెంట్​స్తంభాలు విరిగిపడ్డాయి. మెదక్​ జిల్లాలో చెట్టు విరిగిపడి మహిళ చనిపోగా, నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో యువకుడు మృతి చెందాడు.

 

IPL_Entry_Point