TG PWD Job Portal : దివ్యాంగులకు శుభవార్త.. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు!-minister seethakka has assured that 4 percent reservation will be made for the disabled in private jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Pwd Job Portal : దివ్యాంగులకు శుభవార్త.. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు!

TG PWD Job Portal : దివ్యాంగులకు శుభవార్త.. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు!

Basani Shiva Kumar HT Telugu
Oct 15, 2024 10:41 AM IST

TG PWD Job Portal : తెలంగాణలోని దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సచివాలయంలో దివ్యాంగులకు సంబంధించిన జాబ్ పోర్టల్​ను మంత్రి ఆవిష్కరించారు. త్వరలో బ్యాక్​లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.

దివ్యాంగులకు జాబ్ పోర్టల్​
దివ్యాంగులకు జాబ్ పోర్టల్​ (@meeseethakka)

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. మంత్రి సీతక్క వివరించారు. దివ్యాంగులు ప్రైవేటు ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా జాబ్‌పోర్టల్‌ను అందుబాటులో తెచ్చామని వివరించారు.

సోమవారం తెలంగాణ సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్‌ శైలజ, దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముత్తినేని వీరయ్యతో కలిసి జాబ్‌పోర్టల్‌ https://pwdjobportal.telangana.gov.in ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌లో 10 మంది దివ్యాంగులకు నియామకపత్రాలు అందజేశారు.

'తెలంగాణలోని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులు వారి కోసం ఖర్చు చేస్తున్నాం. దివ్యాంగుల ఉపకరణాల కోసం రూ.50 కోట్లు వెచ్చించబోతున్నాం. త్వరలోనే దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తాం. స్వయం ఉపాధి పథకాలకు చేయూత అందిస్తాం' అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పోర్టల్‌ను ప్రారంభించడం మంచి పరిణామమని.. కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల వివరాలు తీసుకొని.. వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ పోర్టల్​పై కార్పొరేషన్ తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Whats_app_banner