Harish Rao : దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య సేవలు : హరీశ్ రావు-minister harish rao inaugurates dialysis centre at choutuppal government hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Inaugurates Dialysis Centre At Choutuppal Government Hospital

Harish Rao : దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య సేవలు : హరీశ్ రావు

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 05:27 PM IST

Harish Rao : ప్రభుత్వ వైద్య సేవల అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని.. వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి హరీశ్ ప్రారంభించారు.

మంత్రులు హరీశ్, జగదీశ్ రెడ్డి
మంత్రులు హరీశ్, జగదీశ్ రెడ్డి

Harish Rao : ప్రభుత్వ వైద్య సేవల అంశంలో తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో గణనీయమైన పురోగతి సాధించిందని... వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ అన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో దేశంలోనే మొదటి స్థానంలో... వైద్య విద్య పీజీ సీట్ల విషయంలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని... కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకున్నా.. ఒకే సంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని... ఇది తెలంగాణ ఘనత అని అన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి హరీశ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ వైద్య విధానాలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల పాలకులు మన వద్దకే వస్తున్నారని అన్నారు.

"మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 5 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్త శుద్ధి సేవలు అందించే అంశంలో దేశంలో మార్గదర్శిగా నిలిచాం. తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ పర్యటనకు వచ్చి.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డయాలసిస్ సెంటర్లను పరిశీలించారు. తమిళనాడులోనూ తెలంగాణ తరహాలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. ఇలా దేశంలో మరే రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 102 కు పెంచాం. అంతకముందు కేవలం 3 మాత్రమే ఉండేవి. ఒక సంవత్సరానికి ఒక డయాలసిస్ సెంటర్ నిర్వహణకు రూ. వందకోట్ల వరకు ఖర్చు చేస్తున్నాం" అని మంత్రి హరీశ్ తెలిపారు.

క్యాన్సర్ పేషెంట్ల కోసం చౌటుప్పల్ లో పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని.. రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని హరీశ్ వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్, పీజీ సీట్లు పెంచి.. ఎంబిబిఎస్ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా తెలంగాణలోనే చదువుకునేలా ఏర్పాటు చేశామని చెప్పారు. నర్సింగ్, పారామెడికల్ కాలేజీలలో ఉద్యోగ కల్పన కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్ లో ఎయిమ్స్ ఆసుపత్రి ఇస్తామంటే.. ఐదు కోట్ల విలువైన భూమి ఇచ్చామని.. అయితే కేంద్రం అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు ఒకసారి బిబినగర్ ఎయిమ్స్ కి వచ్చి అక్కడి దుస్థితి చూడాలని... ఆ ఆసుపత్రి కేవలం అలంకార ప్రాయంగా మారిందని హరీశ్ ఆరోపించారు. కార్యక్రమంలో... స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

IPL_Entry_Point