Ts Weather Update: ద్రోణి ప్రభావంతో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Ts Weather Update: తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Ts Weather Update: తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీన పడిందని.. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. .
గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
గత కొద్ది రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. భారత వాతావరణ కేంద్రం రుతుపవనాల రాకను అధికారికంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. కేరళను తాకిన రుతుపవనాలు ఈ నెల 16, 17 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి.
మరోవైపు అరేబియాతీరంలో లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. దాంతో గత 24 గంటలుగా కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో కేరళలోని ఇతర ప్రాంతాలతోపాటుగా కర్ణాటక, తమిళనాడు మీదుగా రుతుపవనాలు కదలనున్నాయని వెల్లడించింది. గంటకు 19 నాట్స్ వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్టు ఐఎండీ వివరించింది.
సాధారణంగా జూన్ 1నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తుంటాయి. బంగాళాఖాతంలో మేలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో అలప్పుజ, ఎర్నాకుళం ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గత ఏడాది మే 29న రుతుపవనాలు దేశంలోకి రాగా.. 2021లో జూన్ 3న ప్రవేశించాయి.
తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల జిల్లా ల్లో ఈదురుగాలులతో వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.