Rain Alert: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Rain Alert: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 11 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం కామారెడ్డిలో అత్యధికంగా 21 మి.మీ, వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌లో 15 మి.మీ, వికారాబాద్ జిల్లా ధరూర్‌లో 14.5 మి.మీ, జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలిలో 11.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు..
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వచ్చే మూడు రోజులు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పార్శిగుట్ట వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజలను అధికారులు అలెర్ట్ చేస్తున్నారు.