Medak Crime : కల్లు దుకాణం వద్ద స్నేహం మహిళ ప్రాణాలు తీసింది
Medak Crime : కల్లు దుకాణం వద్ద ఏర్పడిన స్నేహం ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. కల్లు దుకాణం వద్దకు వచ్చిన మహిళ మెడలో బంగారం చూసి, కాజేసేందుకు ప్లాన్ వేసిన ఓ దంపతులు... యాదాద్రి వెళ్దామని మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. మార్గమధ్యలో మహిళను హత్య చేశారు.
Medak Crime : కల్లు దుకాణం వద్ద ఏర్పడిన పరిచయం, ఒక మహిళ ప్రాణాలు తీసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి సాజు తండాకు చెందిన మాలోత్ లలిత (48) తూప్రాన్ పట్టణంలో ఉన్న కళ్లు దుకాణంలో అప్పుడప్పుడు కల్లు తాగడానికి వెళ్లేది. అక్కడ తనకు తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన వల్లెపు కనకయ్య, వల్లెపు ప్రమీల పరిచయం అయ్యారు. అయితే లలిత బంగారు, వెండి ఆభరణాలు ధరించి ఉండటం చూసిన ఆ దంపతులు, ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలని పన్నాగం పన్నారు.
యాదగిరిగుట్ట వెళ్దామని చెప్పి
ఈ నెల 11 తారీఖున, లలితను బండి పైన యాదగిరిగుట్ట తీసుకెళ్తామని చెప్పి రమ్మన్నారు ఆ దంపతులు. దేవుని దగ్గరికి వెళుతున్నాం కాబట్టి, తప్పకుండా కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి రావాలని లలితకు సూచించారు. ఇంటి దగ్గర తన కుటుంబసభ్యులకు లలిత మాసాయిపేటలోని బ్యాంకుకు వెళుతున్నానని చెప్పి వెళ్లింది. 11వ తారీఖున వెళ్లిన ఆమె, ఆ రోజు రాత్రి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువుల అందరికీ ఫోన్ చేసి ఆమె గురించి వాకబు చేశారు.
నగల కోసమే హత్య
కుటుంబ సభ్యులు చేగుంట పోలీస్ స్టేషన్ లో లలిత కూతురు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్న పోలీసులకు లలిత మాసాయిపేటలో ఒక దంపతుల వెంట వెళ్లినట్టు గుర్తించారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేపట్టి వారు కనకయ్య, ప్రమీలగా గుర్తించి, కస్టడీలోకి తీసుకున్నారు. తదుపరి విచారణలో లలితను నగల కోసమే హత్య చేసినట్లు ఆ దంపతులు ఒప్పుకున్నారు. యాదగిరిగుట్టకు బండిపై వెళ్తుండగా, మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లాలోని పీర్లతండా వద్ద అటవీ ప్రాంతంలో తనను గొంతు నులిమి చంపారు. ఆ తరువాత తన దగ్గర ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్ తీసుకొని తమ ఇంటికి తిరిగి వెళ్లామన్నారు. దొంగిలించిన ఆభరణాలు ఒక బంగారు దుకాణంలో కుదువ పెట్టగా, ఆ వ్యాపారి దంపతులకు రూ 33,000 ఇచ్చాడు.
ఆ వచ్చిన డబ్బుతో ఆ దంపతులు ఒక ద్విచక్ర వాహనం కొన్నారని విచారణలో తేలింది. లలిత శవానికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. లలిత చనిపోయాక, 10 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా, జడ్జి వారిని 14 రోజుల రిమాండ్ కి పంపించారు. ఈ సంఘటన చేగుంట మండలంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును త్వరగా ఛేదించిన, ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
సంబంధిత కథనం