Yadagirigutta Temple : టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు
టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్షించిన ఆయన.. ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యాలు , భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు.
ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీల్లేదని… ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.
స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి…? ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా… అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
మరోవైపు ఇవాళ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు కేటాయించినందుకు విప్ ఆది శ్రీనివాస్ , ఆలయ అర్చకులు, అధికారులు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించారు. వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.