Medak Crime News: హత్య చేసి మంచంలో పడేశారు.. ఎవరిపనై ఉంటుంది?-medak homicide investigation underway after body found ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Medak Homicide Investigation Underway After Body Found

Medak Crime News: హత్య చేసి మంచంలో పడేశారు.. ఎవరిపనై ఉంటుంది?

HT Telugu Desk HT Telugu
Mar 26, 2024 02:26 PM IST

మెదక్: మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రైతును గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో పలుచోట్ల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలో జరిగింది.

కౌడిపల్లిలో హత్య (ప్రతీకాత్మక చిత్రం)
కౌడిపల్లిలో హత్య (ప్రతీకాత్మక చిత్రం)

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కౌడిపల్లి గ్రామానికి చెందిన రాజం భూమయ్య (60), దుర్గమ్మ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. భూమయ్య తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

భూమయ్య నిత్యం వరి పొలానికి నీళ్లు పెట్టి, అడవి పందులు రాకుండా కాపలాగా అక్కడే పడుకుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రామ శివారులో ఉన్న పొలానికి నీరు పెట్టి కాపలాగా అక్కడే పడుకోవడానికి వెళ్ళాడు. 

కాగా సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన రంగయ్య పని ఉందని భూమయ్య ఇంటికి వచ్చాడు. అతడి భార్య దుర్గమ్మ రాత్రి పొలానికి వెళ్లి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని, ఫోన్ పనిచేస్తలేదని, పొలం వద్దకే వెళ్లి కలవమని చెప్పింది. దీంతో రంగయ్య పొలం వద్దకు వెళ్లి చూడగా భూమయ్య రక్తపు మడుగులో హత్యకు గురై కనిపించాడు. 

భయాందోళనకు గురైన రంగయ్య వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే పలువురు గ్రామస్థులతో కలిసి ఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం అధికారులు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తొ పరిశీలించారు.

పదునైన ఆయుధంతో పలుచోట్ల నరికి....

భూమయ్యను ముఖంపై, వీపు మీద పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గొడ్డలి లేదా ఏదేనా పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం మంచంపై పడుకోబెట్టి ఉందని, అక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేవని గమనించారు. అంటే భూమయ్యను మరొక చోట హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తీసుకొని వచ్చి మంచంపై పడుకోబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. 

కుటుంబ కలహాల లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య

తండ్రి కారు కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జరిగింది. చేర్యాలకు చెందిన బుట్టి నర్సింలుకు ముగ్గురు కుమారులు. అతడు పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా రెండవ కొడుకు నవీన్ (25) కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నవీన్ సొంత కారు కొనివ్వమని తండ్రిని అడిగాడు. 

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొన్ని రోజులు డ్రైవర్ గా పనిచేశాక వచ్చిన డబ్బులకు మరికొన్ని కలిపి తర్వాత కారు కొందామని కొడుకుకు నచ్చజెప్పాడు. తండ్రి మాట వినని నవీన్ అలిగి 15 రోజుల నుండి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయంపై తండ్రి ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావని పనిచేసుకోవాలని కొడుకుని మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన నవీన్ సోమవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

IPL_Entry_Point