Medak News : చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, యువకుడు మృతి
Medak News : మెదక్ జిల్లాలో చేపల చెరువు రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ వర్గం వాళ్లు వాహనాలకు తగలబెట్టి, పోలీసులపై దాడికి దిగారు.
Medak News : చెరువులో చేపలు పట్టే విషయంలో బెస్త, ముదిరాజ్ వర్గాల మధ్య జరిగిన వివాదంలో ఒకరు మృతిచెందడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన మెదక్ జిల్లా(Medak News) హవెలిఘనపూర్ మండలం బూర్గుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బూర్గుపల్లిలో చేపలు పట్టే విషయంలో బెస్త, ముదిరాజ్ కులస్థుల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న వివాదం ముదిరింది. బూర్గుపల్లి పరిధిలో పెద్దచెరువు, శ్రీపతి చెరువు, పోచారం డ్యామ్(Pocharam Dam) లు ఉన్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య సభ్యత్వానికి సంబంధించిన వివాదం నెలకొంది. కాగా అన్ని చెరువులలో తమకు హక్కులు కల్పించాలని ముదిరాజులు డిమాండ్ చేయగా, బెస్త కులస్థులు అంగీకరించడం లేదు. దీంతో మూడేండ్ల నుంచి చేపలు పట్టడం లేదు. ఈ క్రమంలో చెరువులో చేపలు పట్టేందుకు బెస్త కులస్థులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
యువకుడి మృతి
శుక్రవారం పోలీస్ బందోబస్తు మధ్య మత్స్యశాఖ ఆధ్వర్యంలో బెస్త కులస్థులు చేపలు పట్టేందుకు చెరువులో దిగి వలలు వేశారు. వీరిని అడ్డుకునేందుకు ముదిరాజ్ వర్గీయులు ప్రయత్నించగా పోలీసులు(Police) ఆపే ప్రయత్నం చేశారు. అయినా కొందరు చెరువులో దూకగా, ప్రమాదవశాత్తు వల కాళ్లకు చిక్కుకొని కొల్లూరి రాజు (30)అనే యువకుడు మృతి చెందాడు. రాజు మృతి విషయం తెలియడంతో ముదిరాజ్ (Mudiraj)లు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వర్గం వారు దాడులకు దిగి చెరువు కట్టపై ఉన్న 8 బైక్ లు ఒక టాటాఎస్ వాహనానికి నిప్పుపెట్టారు. చెరువులో చేపలు పడుతున్న వారిపై దాడికి యత్నించగా అడ్డుగా వచ్చిన పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులు ముదిరాజ్ లను శాంతిపజేసే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఒప్పుకోలేదు.
మైనంపల్లి హామీతో సద్దుమణిగిన గొడవ
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanumantha Rao) అక్కడికి చేరుకొని ముదిరాజులతో మాట్లాడారు. ప్రమాదవశాత్తు మరణించిన రాజు కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మైనంపల్లి హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఆయనతో పాటు అక్కడున్న పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఆర్డీఓ పేర్కొన్నారు. స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ చెరువులో చేపలు పట్టవద్దని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వేములవాడ రామాచారి (52) కి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతడు కార్పెంటర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో అతడు చేసిన అప్పులు తీర్చలేక,ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగాడు. అది గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం