Maheswar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేసిన మహేశ్వర్ రెడ్డి…-maheshwar reddy left the congress party and joined the bjp ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Maheswar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేసిన మహేశ్వర్ రెడ్డి…

Maheswar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేసిన మహేశ్వర్ రెడ్డి…

HT Telugu Desk HT Telugu
Apr 13, 2023 01:31 PM IST

Maheswar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వికెట్ పడింది. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గేకు పంపారు.పిసిసి నోటీసులపై ఢిల్లీ వెళ్లిన మహేశ్వర్ రెడ్డి అనూహ్యంగా బీజేపీ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి

Maheswar Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మహేశ్వర్‌ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2009లో పిఆర్పీ తరపున గెలిచిన మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే అభియోగాలపై పిసిసి ఆయనకు నోటీసులు జారీ చేసింది. పిసిసి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్వరర్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో తేల్చుకుంటానని ప్రకటించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను కలిసి పిసిసి పరిణామాలపై చర్చిస్తారని భావిస్తే అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలసి మహేశ్వర్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం క్రితం బండి సంజయ్, ఈటలతో కలిసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్ నివాసానికి మహేశ్వర్‌‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డికి తరుణ్ చుగ్ శాలువా కప్పి సత్కరించారు. ఈ భేటీ అనంతరం వీరంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లారు. నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మహేశ్వర్‌ రెడ్డి బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నిన్న షోకాజ్ నోటీసు ఇచ్చారు. 24గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో ఆదేశించారు. నోటీసుకు ఆయన సమాధానం ఇవ్వకపోగా... టీపీసీసీనే తనకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులపై కాంగ్రెస్ పెద్దలతో తేల్చుకుంటామని ప్రకటించిన మహేశ్వర్ రెడ్డి అనూహ్యంగా పార్టీకి గుడ్‌బై చెప్పేయడం కలకలం రేపింది. మహేశ్వర్ రెడ్డికి నోటీసుల వ్యవహారాన్ని పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన గంటల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు.

 

 

Whats_app_banner