Karimnagar Tragedy: చందాలతో అంతిమ సంస్కారం, కరీంనగర్ జిల్లాలో హృదయ విదారకమైన ఘటన
Karimnagar Tragedy: అసలే పేదరికం... ఆపై అనారోగ్యం... ఫలితంగా ప్రాణం పోయింది. అద్దె ఇంట్లోకి శవాన్ని తీసుకు రావద్దని ఇంటి ఓనర్ చెప్పడంతో ఊరు బయట డేరా కింద శవాన్ని పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక అంత్యక్రియలు నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడటంతో గ్రామస్తులు తలో చేయి వేసి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
Karimnagar Tragedy: పేదరికం... ఆపై అనారోగ్యం... ఫలితంగా ప్రాణం పోయింది. అద్దె ఇంట్లోకి శవాన్ని తీసుకురావద్దని ఇంటి ఓనర్ చెప్పడంతో ఊరు బయట డేరా కింద శవాన్ని పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక అంత్యక్రియలు నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులే తలో చేయి వేసి అంతిమ సంస్కారం పూర్తి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి కి చెందిన కోట లక్ష్మన్ ప్రేమలత దంపతులు దినసరి కూలీలు. కూలీ పనితో పూటగడుపుకునే దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. అద్దె ఇంట్లో నివాసం ఉంటు అప్పులు చేసి ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. నిత్యం కూలీ పనికి వెళ్ళే లక్ష్మణ్ పని చేసే చోట అకస్మాత్తుగా కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. వెంటనే స్థానికులు హుజూరాబాద్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం కు తరలించారు.
ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ లు బ్రెయిన్ స్ట్రోక్ తో లక్ష్మన్ మృతి చెందారని నిర్ధారించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగ అద్దె ఇంటి యాజమాని శవాన్ని తన ఇంటి ముందు పెట్టొద్దన్నాడు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న లక్ష్మణ్ భార్య ప్రేమలతకు ఇద్దరు కూతుళ్ళకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఊరు బయట టెంట్ కింద…
అద్దె ఇంట్లోకి శవాన్ని ఇంటి ఓనర్ తీసుకురానివ్వక పోవడంతో ఊరు బయట టెంట్ కింద శవాన్ని పెట్టారు. రెక్కాడితేగానీ దొక్కనిండని కుటుంబం కావడంతో అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లి గవ్వలేక కుటుంబం చేతులు చాచి రోదించడం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. అయ్యో పాపం లక్ష్మణ్ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తలో చేయి వేశారు. తోచిన సహాయం నగదు రూపంలో చేసి అంత్యక్రియలు అంతిమ సంస్కారం పూర్తి చేశారు.
తలకొరివి పెట్టిన కూతురు…
కడుపేదరికంతో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన లక్ష్మణ్ కు ఇద్దరు కూతుళ్ళే ఉండడంతో చివరికి వారే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె తండ్రికి తల కొరివి పెట్టింది. గ్రామంలో అందరి నోట్లో నాలుకలా మెదిలే లక్ష్మణ్ దీనస్థితిని చూసినవారు ఇలాంటి పరిస్థితి పగవాడికి సైతం రావద్దు అంటూ లక్ష్మణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
ఉండడానికి ఇల్లు కూడా లేని లక్ష్మణ్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. హృదయ విదారకమైన ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)